AP HC Suspended GO No 1: ఏపీ సర్కార్ కు షాక్.. జీవో 1 ని సస్పెండ్ చేసిన హైకోర్టు-ap high court suspended ap government go no 1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc Suspended Go No 1: ఏపీ సర్కార్ కు షాక్.. జీవో 1 ని సస్పెండ్ చేసిన హైకోర్టు

AP HC Suspended GO No 1: ఏపీ సర్కార్ కు షాక్.. జీవో 1 ని సస్పెండ్ చేసిన హైకోర్టు

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 04:28 PM IST

AP High Court Suspended GO No.1: ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 1ని సస్పెండ్ చేసింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP HC Verdict On Govt GO No 1: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. సర్కార్ తీసుకువచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం… ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

జీవోపై వివాదం..

కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించింది ఏపీ సర్కార్. ఈ మేరకు జీవో నెంబర్ 1ని తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ ఉత్తర్వులు ఇచ్చారని.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అపొజిషన్ పార్టీలు అధికార వైఎస్సార్సీపై విరుచుకుపడుతున్నాయి. తమ సభలకు వస్తోన్న జనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్ నిర్బంధాలకు తెరతీశారని టీడీపీ ఆరోపిస్తోండగా... పవన్ విశాఖ పర్యటన నుంచే ప్రభుత్వం నుంచి ఇలాంటి వైఖరి మొదలైందని జనసేన మండిపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుని కుప్పంలో పోలీసులు అడ్డుకోవడం... హైదరాబాద్ లో బాబుని కలిసి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం... రెండు పార్టీలు కలిసి జీవో నంబర్ వన్ పై పోరాడతామని ప్రకటించడం తెలిసిందే. ఈ అంశంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పవన్, బాబు.... అదే సమయంలో పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. మిగతా పార్టీలు కూడా ఈ జీవోని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు.

ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. సభలు, రోడ్ షోలు ఆపేందుకే జీవో తెచ్చారనేది నిజం కాదని... జీవో ద్వారా రోడ్ షో, పాదయాత్రలపై నిషేధం విధించామనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. దీనిపై ఏపీ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యర్ వివరణ ఇచ్చారు. కీలక ప్రాంతాల్లో మాత్రమే నియంత్రించాలని చెప్పామని.. సభలు, రోడ్ షోలకు అనుమతి కోరితే పరిశీలించి అనుమతి ఇస్తామని చెప్పారు. కందుకూరు, గుంటూరు ఘటనల దృష్ట్యా జీవో జారీ చేశామన్న ఆయన... పోలీసు నిబంధనలు పాటించి సభలు, రోడ్ షోలు జరుపుకోవచ్చని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి కోరిన వారు పోలీసులు అడిగిన కొన్ని అంశాలపై సరైన సమాచారం ఇవ్వలేదని... అందుకే రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. 1861 చట్టంలో ఉన్న నిబంధనల మేరకే జీవో జారీ చేయడం జరిగిందని.. నిషేధిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

మొత్తంగా వివాదస్పదంగా మారిన ఈ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point