Sajjala On RoadShows : చీకటి జీవో అనడంలో అర్థం లేదన్న సజ్జల ….విపక్షాల ఆగ్రహం-ap government advisor sajjala supports government decision on roadshows ban ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala On Roadshows : చీకటి జీవో అనడంలో అర్థం లేదన్న సజ్జల ….విపక్షాల ఆగ్రహం

Sajjala On RoadShows : చీకటి జీవో అనడంలో అర్థం లేదన్న సజ్జల ….విపక్షాల ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 01:02 PM IST

Sajjala On RoadShows ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీ, మునిసిపల్ రోడ్లపై ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని చీకటి జీవోలుగా పేర్కొనడాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పు పట్టారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వైఎస్సార్సీపీకి కూడా వర్తిస్తాయన్నారు.

రోడ్లపై సభలు, సమావేశాల నిషేధం ఆదేశాలను సమర్థించిన సజ్జల
రోడ్లపై సభలు, సమావేశాల నిషేధం ఆదేశాలను సమర్థించిన సజ్జల

Sajjala On RoadShows బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై విమర్శలు వెల్లువెత్తడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వైఎస్సార్సీపీకి కూడా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరనే సంగతిని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయని, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తమ పార్టీ కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ జీవో చీకటి జీవో అనడంలో అర్థం లేదన్నారు. అవే నిబంధనలు తమకు కూడా వర్తిస్తాయన్నారు. రాజకీయ పార్టీలు సభలు సమావేశాలను ఖాళీ ప్రదేశాలు, మైదానాల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

పార్టీలు సభలను నిర్వహించాలని భావిస్తే వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చని, రోడ్లపై నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తు తుండటంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 అధికార పార్టీకి కూడా వర్తిస్తుందని చెప్పారు. రోడ్ల మీద బహిరంగ సభలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అన్ని అంశాలపై బేరీజు వేసుకున్న తర్వాత జీవో విడుదల చేసినట్లు తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేయడానికి మాత్రమే జీవో జారీ చేశారనే ఆరోపణల్ని సజ్జల తోసిపుచ్చారు. ప్రభుత్వం వేరు పార్టీ వేరని, కందుకూరు, గుంటూరు ఘటనల్ని సమీక్షించిన తర్వాత ప్రబుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదనే వాదన కూడా సరికాదని, ఏ ఇబ్బంది తలెత్తనన్ని రోజులు ఎలాంటి సమస్య రాలేదని, వరుస సంఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతోనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రోడ్లు ఉన్నది సమావేశాల నిర్వహణ కోసం కాదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బేరీజు వేసిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సమస్యలకు ముగింపు పలకడానికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఎక్కడైనా సభలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, పోలీస్ యాక్ట్‌ ప్రకారం అనుమతులు మంజూరు చేస్తారని గుర్తు చేశారు. గతంలో వైసీపీ కార్యక్రమాల నిర్వహణకు పోలీసులు అనుమతులు నిరాకరించిన సందర్బాలు కూడా ఉన్నాయన్నారు. గుంటూరులో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో తాము ఊరి వెలుపల సమాావేశం పెట్టుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాల కార్యక్రమాలను కుట్ర పూరితంగా అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వైసీపీ కూడా లోబడి ఉండాల్సిందేనని చెప్పారు.

ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుందని, నిబంధనలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుందని సజ్జల చెప్పారు. టీడీపీ నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే దాని పర్యావసానాలు కూడా ఆ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు లోబడే ఎవరైనా వ్యవహరించాల్సి ఉంటుందని, టీడీపీ నాయకులు వాటిని ఉల్లంఘించాలని భావిస్తే అందుకు తగిన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వారిపై ఉంటుందన్నారు.

స్వాగతించిన జీవిఎల్……

రోడ్లపై సభలు, సమావేశాలు నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎంపీ జీవిఎల్ స్వాగతించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్టీలు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. పబ్లిక్‌ ప్రదేశాల్లో సభలు పెట్టకూడదనే నిర్ణయాన్ని కొంత కాలమైనా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ జివిఎల్ అన్నారు. సభలు పెట్టడం ప్రాథమిక హక్కు అయినా, దానిని ప్రజల హక్కుల్ని ఉల్లంఘించేందుకు వినియోగించకూడదన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా పార్టీలు వ్యవహరించడం తగదన్నారు.

మరోవైపు బీజేపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎంపీ సిఎం రమేష్‌. అమిత్ షా కార్యక్రమాన్ని అడ్డుకోడానికే ఇలాంటి ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. తక్షణం ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సిఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. అధికారం చేతుల్లో ఉందని ఏది చేసినా చెల్లుతుందని భావిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వ పాలన సాగుతోందని, నిరసన తెలిపే హక్కు, సమావేశాలు నిర్వహించే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL_Entry_Point