GO Number 1 Issue : జీవో నంబర్ 1 వివాదం.. ఏపీ పోలీసుల వివరణ ఇదే..-ap police gives clarification on go number 1 amid opposition parties demand to scrap the orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Go Number 1 Issue : జీవో నంబర్ 1 వివాదం.. ఏపీ పోలీసుల వివరణ ఇదే..

GO Number 1 Issue : జీవో నంబర్ 1 వివాదం.. ఏపీ పోలీసుల వివరణ ఇదే..

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 10:48 PM IST

GO Number 1 Issue : జీవో నంబర్ వన్ పై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ.. ఆంక్షల ఉత్తర్వులపై అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యర్ వివరణ ఇచ్చారు. జీవో ద్వారా రోడ్ షోలు, పాదయాత్రలపై నిషేధం విధించారనే ప్రచారం అవాస్తవమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చని... పార్టీలు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

ఏపీ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యర్
ఏపీ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యర్

GO Number 1 Issue : రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ ఉత్తర్వులు ఇచ్చారని.. బ్రిటీష్ కాలం నాటి జీవోలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అపొజిషన్ పార్టీలు అధికార వైఎస్సార్సీపై విరుచుకుపడుతున్నాయి. తమ సభలకు వస్తోన్న జనం, ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్ నిర్బంధాలకు తెరతీశారని టీడీపీ ఆరోపిస్తోండగా... పవన్ విశాఖ పర్యటన నుంచే ప్రభుత్వం నుంచి ఇలాంటి వైఖరి మొదలైందని జనసేన మండిపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుని కుప్పంలో పోలీసులు అడ్డుకోవడం... హైదరాబాద్ లో బాబుని కలిసి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం... రెండు పార్టీలు కలిసి జీవో నంబర్ వన్ పై పోరాడతామని ప్రకటించడం తెలిసిందే. ఈ అంశంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పవన్, బాబు.... అదే సమయంలో పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో.... జీవో నంబర్ వన్ పై పోలీసులు వివరణ ఇచ్చారు.

సభలు, రోడ్ షోలు ఆపేందుకే జీవో తెచ్చారనేది నిజం కాదని... జీవో ద్వారా రోడ్ షో, పాదయాత్రలపై నిషేధం విధించామనే ప్రచారం అవాస్తవమని.. అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యర్ జనవరి 10న తెలిపారు. కీలక ప్రాంతాల్లో మాత్రమే నియంత్రించాలని చెప్పామని.. సభలు, రోడ్ షోలకు అనుమతి కోరితే పరిశీలించి అనుమతి ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో జనసేన తలపెట్టిన సభకు అనుమతి ఇచ్చామని వివరించారు. కందుకూరు, గుంటూరు ఘటనల దృష్ట్యా జీవో జారీ చేశామన్న ఆయన... పోలీసు నిబంధనలు పాటించి సభలు, రోడ్ షోలు జరుపుకోవచ్చని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి కోరిన వారు పోలీసులు అడిగిన కొన్ని అంశాలపై సరైన సమాచారం ఇవ్వలేదని... అందుకే రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు.

"ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా.. ఈ జీవో తీసుకురావడం జరిగింది. జాతీయ రహదారులు, రాష్ట్ర మున్సిపల్, పంచాయతీ రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే పలు నిబంధనలు అమల్లోకి తేవడం జరిగింది. అంతే తప్ప సభలు, సమావేశాలను అడ్డుకోవడం జీవో ఉద్దేశం కాదు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు పెట్టుకోవచ్చు. శ్రీకాకుళంలో సభ కోసం జనసేన వాళ్లు అప్లికేషన్ సమర్పించారు. వారికి అనుమతి ఇచ్చాం. 1861 చట్టంలో ఉన్న నిబంధనల మేరకే జీవో జారీ చేయడం జరిగింది. నిషేధిస్తామని ఎక్కడా చెప్పలేదు. ఆర్టికల్ 19 ప్రకారం పార్టీలు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. పాదయాత్రలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. లోకేశ్ పాదయాత్రకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం" అని అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యర్ అన్నారు.

ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో... రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై సభలపై ఆంక్షలు విధిస్తూ.. ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలో దుమారం రేపాయి. ఈ అంశంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

IPL_Entry_Point