Restrictions in AP: ఏపీలో ఆంక్షలు.. బాబు పర్యటనపై నోటీసులు.. విరుచుకుపడుతున్న విపక్షాలు..-ap police issues notices to chandrababu tour opposition slam govt go restricting political parties rallies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Restrictions In Ap: ఏపీలో ఆంక్షలు.. బాబు పర్యటనపై నోటీసులు.. విరుచుకుపడుతున్న విపక్షాలు..

Restrictions in AP: ఏపీలో ఆంక్షలు.. బాబు పర్యటనపై నోటీసులు.. విరుచుకుపడుతున్న విపక్షాలు..

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 04:40 PM IST

Restrictions in AP: రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై నిర్వహించే సభలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో.. దుమారం రేపుతోంది. ఈ ఉత్తర్వులపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. ఆంక్షల అమలులో భాగంగా జనవరి 4 నుంచి జరగనున్న చంద్రబాబు పర్యటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వ జీవోపై విపక్షాలు పైర్
ఏపీ ప్రభుత్వ జీవోపై విపక్షాలు పైర్

Restrictions in AP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై సభలపై ఆంక్షలు విధిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు దుమారం రేపుతున్నాయి. కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట వల్ల ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆంక్షల అమలులో భాగంగా... ఏపీ పోలీసులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనపై నోటీసులు ఇచ్చారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

జనవరి 4 నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. పర్యటించే ప్రాంతాలకు సంబంధించి రూట్ మ్యాప్, సమయంతో కూడిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమాచారం పోలీసులకి చేరడంతో.. చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాలని పలమనేరు పోలీసుల నుంచి కుప్పం టీడీపీ నేతలకు నోటీసులు అందాయి. రాష్ట్రం ప్రభుత్వం సోమవారం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి ఉన్న చోటనే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని పలమనేరు డీఎస్పీ పేర్కొన్నారు. దీంతో... రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

టీడీపీకి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే .. చంద్రబాబు సభలు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ తెగువ చూసి వైఎస్సార్సీపీ వణికిపోతోందని.. టీడీపీ సభలకు వెళ్తే పథకాలు రద్దు చేస్తామని ప్రజల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే చీకటి జీవో తెచ్చారని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని అమల్లోకి తేవడం చాలా దారుణమని.. నిరసన హక్కును హరించే జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సభలకు జనం రావడం లేదా అని నిలదీశారు.

రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే బహిరంగ సభలు, ర్యాలీలు, నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణి బయటపెట్టిందని.... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో అని అన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా నిలదీశారు. ఏదో ఒక రోజు జీవించే హక్కుని కూడా హరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై ప్రజల వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతోందని విమర్శించారు.ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ బెంజి సర్కిల్లో అన్ని మార్గాలను మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ బండ్లకు జగన్ జండా ఊపలేదా ? అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా అని ప్రశ్నించారు. శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని అన్నారు. ప్రతిపక్ష పార్టీ సమావేశాలకు సైతం పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర హోం శాఖకు ఉందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయం లేకపోతే చీకటి జీవో ఉపసంహరించుకుని.... ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలకు పూర్తి భద్రత ఇవ్వాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

IPL_Entry_Point