Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. భార్య క‌ళ్లెదుటే వ‌ర‌దలో కొట్టుకుపోయిన భ‌ర్త‌-biker washed away in flood water in vizianagaram district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. భార్య క‌ళ్లెదుటే వ‌ర‌దలో కొట్టుకుపోయిన భ‌ర్త‌

Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. భార్య క‌ళ్లెదుటే వ‌ర‌దలో కొట్టుకుపోయిన భ‌ర్త‌

HT Telugu Desk HT Telugu
Sep 12, 2024 09:13 AM IST

Vizianagaram : విజ‌యన‌గ‌రం జిల్లాలో విషాదం జరిగింది. భార్య క‌ళ్లెదుటే వ‌రద నీటిలో భ‌ర్త కొట్టుకుపోయాడు. దీంతో తన భ‌ర్త‌ని కాపాడాలని ఆ కేక‌లు వేసింది. అయిన ప్ర‌యోజ‌నం లేదు. ఆమె ముందే భ‌ర్త వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.

ఘటనా స్థలంలో అధికారులు
ఘటనా స్థలంలో అధికారులు

విజ‌య‌న‌గరం జిల్లా గంట్యాడ మండ‌లంలో బుధ‌వారం సాయంత్రం విషాదం జరిగింది. విజ‌య‌న‌గరం జిల్లా ఎల్‌ కోట మండ‌లం చందులూరి గ్రామానికి చెందిన అప్ప‌ల‌బ‌త్తుల స‌తీష్ (35), భార్య వ‌ర‌ల‌క్ష్మితో క‌లిసి అత్త‌వారి గ్రామం గంట్యాడ మండ‌లం చంద్రంపేట‌కు మంగ‌ళ‌వారం వెళ్లారు. బుధ‌వారం భార్య పేరు మీద వ‌చ్చిన డ్వాక్రా డ‌బ్బులు తీసుకుని ద్విచ‌క్ర వాహ‌నంపై గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్ద‌గెడ్డ వాగు క‌ల్వ‌ర్టు దాటుతున్నారు. నీటి ప్ర‌వాహం, అందులో నాచు కార‌ణంగా అదుపుత‌ప్పి ప‌డిపోయారు.

స‌తీష్ వాగులోకి కొట్టుకుపోయారు. ర‌క్ష‌ణ స్తంభాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న వ‌ర‌ల‌క్ష్మిని స్థానికులు ర‌క్షించారు. ఆ తర్వాత పోలీసులకు స‌మాచారం అందించారు. స‌తీష్ క‌రెంటు, ఇనుప వ‌స్తువుల‌కు సంబంధించిన ప‌నులు చేస్తుంటారు. చాలా ఏళ్ల కిందట విద్యుదాఘాతానికి గురై ఒక చేతిని కోల్పోయారు. ప్లాస్టిక్ చేతిని అమ‌ర్చుకుని ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దిచ‌క్రవాహ‌నం అదుపు త‌ప్పిన స‌మ‌యంలో.. ఒక్క చేతితో ప‌ట్టు కోల్పోయాడ‌ని, అందుకే వ‌ర‌ద ప్ర‌వాహ‌నికి కొట్టుకుపోయాడ‌ని స్థానికులు చెబుతోన్నారు.

ఆర్డీవో సూర్య‌క‌ళ‌, ఎమ్మార్వో నీల‌కంఠేశ్వ‌ర‌రావు, ఎస్ఐ సాయికృష్ణ ఘ‌టనా స్థ‌లానికి చేరుకున్నారు. ఏపీఎస్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దింపి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎంత‌సేప‌టికి సతీష్ ఆచూకీ దొర‌క‌లేదు. రాత్రి కావ‌డంతో గాలింపు చర్య‌లు ఆపేశారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల ల‌లిత కుమారి, క‌లెక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

అధికారుల‌తో మాట్లాడి గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. గురువారం ఉద‌యం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మిస్సింగ్ కేసును న‌మోదు చేశారు. దీంతో స‌తీష్ కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. బంధువులు రోద‌న‌లు మిన్నంటాయి. ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ఓదార్చుతూ.. ప్ర‌భుత్వం త‌ర‌పున స‌హాయం చేస్తామ‌ని ఎమ్మెల్యే ల‌లిత కుమారి హామీ ఇచ్చారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)