Pawan Kalyan : పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ(TDP Janasena BJP) పొత్తు కోసం చీవాట్లు తిన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో పర్యటించిన ఆయన... టీడీపీ, జసనేన ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ... పొత్తుకోసం జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో తనకే తెలుసన్నారు. పొత్తు కోసం జాతీయ నాయకత్వాన్ని ఒప్పించేందుకు నానా మాటలు పడ్డానన్నారు. రెండు చేతులు జోడించి, దండం పెట్టి అడిగానన్నారు. తానెప్పుడూ స్వలాభం కోసం అడగలేదని, రాష్ట్ర భవిష్యత్ కోసం అడిగానన్నారు. వైసీపీ(Ysrcp)పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. మనుషులను విడగొట్టడమే ఆయన విషసంస్కృతి అన్నారు. సమాజాన్ని కలిపే వారినే ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని మండిపడ్డారు. అనంతబాబు జైలు విడుదలైనప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నారని గుర్తుచేశారు.
వైఎస్ఆర్ వేల కోట్లు సంపాదించి తన ఇద్దరు బిడ్డలకు ఇస్తే...అందులో చెల్లికి వాటా ఇవ్వలేదు జగన్ (Jagan)అంటూ ఆరోపించారు. సాక్షి పేపర్, భారతి సిమెంట్ లో సొంత చెల్లికి వాటాలు ఇవ్వని వ్యక్తి జగన్ అన్నారు. సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి సమాజానానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక జనసేన మరింత బలపడిందన్నారు. వైసీపీ సిద్ధం అంటే జనసేన యుద్ధం అంటుందన్నారు. తనను ఆపాలని చూస్తే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాన్నారు. వైసీపీ పాలనతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని టీడీపీ, జనసేన కూటమే రక్షించాలన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలనే పొత్తు కోసం ప్రయత్నించానన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మనల్ని ఏ శక్తి ఆపలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే ఈసారి ఓట్లు చీలకూడదని పిలుపునిచ్చానన్నారు.
తాను ఎవరినైనా నమ్మితే చిత్తశుద్ధితో పనిచేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. డబ్బులతో ఓట్లు కోనే రాజకీయం పోవాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం కాదు, అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని పవన్ అన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలితే సీఎం జగన్ లాభపడతారని తెలిపారు. ఇలా జరగకుండా ఉండేందుకే తాను పొత్తుకు ప్రయత్నించానన్నారు. అయితే పొత్తు అంత సులభంగా జరగలేదని గుర్తుచేశారు. పొత్తు కోసం వెళ్లే జాతీయ నాయకత్వంతో ఎన్ని తిట్లు తిన్నానో తనకు మాత్రమే తెలుసన్నాను.
ఎన్నికల ఖర్చుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అన్నారు. కార్యకర్తలకు కనీసం భోజనాలు పెట్టకపోతే ఎలా అన్నారు. ఓట్లు కొంటారా లేదా అనే నిర్ణయం మీరే తీసుకోవాలన్న పవన్... ఎన్నికల సంఘం సైతం అభ్యర్థి ఖర్చును రూ.45 లక్షలకు పెంచిందన్నారు. అసలు ఓట్లు కొనే పరిస్థితి లేకపోతే అదృష్టమని, కానీ దేశమంతా అందమైన అబద్ధంలో బతుకుతోందన్నారు. ఎన్నికల కోసం వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరన్నారు.
సంబంధిత కథనం