Tirumala Laddu : చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!-bandi sanjay letter to chandrababu in tirumala laddu case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu : చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Tirumala Laddu : చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Basani Shiva Kumar HT Telugu
Sep 20, 2024 03:09 PM IST

Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రసాదంలో కల్తీతోపాటు జరుగుతున్న అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. చంద్రబాబుకు లేఖ రాశారు.

బండి సంజయ్
బండి సంజయ్ (ANI)

తిరుమల లడ్డూ ఇష్యూపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 'కలియుగ ప్రత్యక్ష దైవం, వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో.. శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతోపాటు.. కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెను వినియోగించారని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోంది' అని సంజయ్ లేఖలో ప్రస్తావించారు.

'గత పాలకులు శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా ఎన్నడూ పట్టించుకోలేదు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం కొల్లగొడుతూ.. ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. అయినా స్పందించలేదు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ‘‘అన్నప్రసాదం నుండి లడ్డూ ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారు.’’ అని మీరు చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోంది' అని సంజయ్ వ్యాఖ్యానించారు.

'లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచం. ఒకవేళ అదే నిజమైతే హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే అనుమానిస్తున్నాం. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేసినట్లుగా భావిస్తున్నాం' అని బండి సంజయ్ లేఖలో వ్యాఖ్యానించారు.

'సాక్షాత్తు శ్రీవారు కొలువైన పరమ పవిత్రమైన తిరుమల కొండపైనే ఇంతటి ఘోరమైన అపచారానికి పాల్పడిన వారు క్షమించరాని నేరానికి ఒడిగట్టినట్లే. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఇలాంటి కుట్రలకు ఆస్కారం ఏర్పడింది. ఉన్నతస్థాయి వ్యక్తుల పాత్ర లేనిదే ఇంతటి నీచమైన పనిని నిరాటంకంగా ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశం లేదు' అని సంజయ్ అభిప్రాయపడ్డారు.

'ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్దారించడంతోపాటు, ఇతర రాష్ట్రాల్లోనూ విచారణను కొనసాగించాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముంది. ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే' అని సంజయ్ స్పష్టం చేశారు.

'రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి.. ప్రపంచంలోని యావత్ హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అని సంజయ్ లేఖ రాశారు.

'హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం పూర్తిగా నిషిద్ధం. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి నీచమైన, ఘోరమైన కార్యక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. ఇకపై అలాంటి వారికి టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమత ప్రచారం జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నా. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేస్తున్నా' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.