Kolkata Rape Case : కోల్‌కతా రేప్ కేసులో సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, పోలీసు అధికారి మెుండల్
Kolkata Doctor Rape Case : కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి అభిజిత్ మొండల్‌ను సీబీఐ కస్టడీకీ తీసుకుంది.
వైద్యురాలి హత్యాచారం కేసులో ఆర్‌జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అభిజిత్ మెుండల్‌ను కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 17 వరకు వీరికి కస్టడీ విధించింది. సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై ఎస్‌హెచ్ఓ మొండల్‌ను సీబీఐ శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం తదితర అభియోగాలు పోలీసు అధికారిపై ఉన్నాయి.
సెప్టెంబర్ 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు సీబీఐ తమ కస్టడీకి తీసుకుంది. ఇప్పుడు ఇద్దరినీ కలిపి విచారించనున్నారు. వీరిద్దరూ ఆర్‌జి కర్ కేసులో కీలక పాత్ర పోషించారని సీబీఐ తెలిపింది. శనివారం జరిగిన విచారణలో సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.
సందీప్ ఘోష్, మొండల్‌తో టచ్ లో ఉన్నారని, అత్యాచారం, హత్య కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ ఈ ఘటనను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించారని, అలాగే ఘోరమైన నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. గతంలో ఆర్థిక అవకతవకల కేసులో అరెస్టయిన డాక్టర్ ఘోష్ ఇప్పుడు సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు.
'సందీప్ ఘోష్, మెుండల్ మధ్య కమ్యూనికేషన్‌ను సూచించే అన్ని కాల్ రికార్డ్‌లు మా వద్ద ఉన్నాయి. ఏదైనా విషయం దాగి ఉంటే దానిని మేం బయటకు తీయాలి. వారిద్దరినీ విచారణ చేయాలనుకుంటున్నాం. పోలీసులకు, సీబీఐకి మధ్య ఎలాంటి వివాదం లేదు. లోతుగా విచారణ చేసి సత్యాన్ని బయటకు తీసుకురావాలి అనుకుంటున్నాం. మాకు అతను పోలీసు అధికారి కాదు.. అనుమానితుడు.'అని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అత్యాచారం-హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యంపై కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తాయి. సెమినార్ హాల్‌లో డాక్టర్ మృతదేహాన్ని కనుగొన్న 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది. అప్పుడు డాక్టర్ ఘోష్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా ఎందుకు దాఖలు చేశారని అడిగాయి.
'మెుండల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాడు. ఆస్పత్రి వర్గాలు ఆత్మహత్యగా చెప్పేందుకు ప్రయత్నించాయి. అతని వైపు నుంచి తప్పు జరిగింది. ఇది లైంగిక వేధింపుల కేసు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. ఇతర వ్యక్తులతో కలిసి కుట్రలో ఉన్నాడు.' అని సీబీఐ కోర్టుకు నివేదించింది.
31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో అత్యాచారం జరిగింది. లైంగికదాడిలో బాధితురాలికి బాహ్య, అంతర్గత గాయాలు అయ్యాయని, హత్యకు గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అత్యంత కిరాతక హత్యాచారం కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.