Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదం - తెరపైకి ల్యాబ్ రిపోర్ట్..! నిర్ధారణ జరిగిందన్న సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి లడ్డూపై వివాదం నెలకొంది. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరింది. తాజాగా ఓ ల్యాబ్ రిపోర్ట్ ను చూపిస్తూ టీటీడీ నేతలు పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ అంశం హాట్ టాపిక్ గా మారింది. జంతువుల కొవ్వు వాడారని బుధవారం సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ రిపోర్టును టీడీపీ నేతలు తెరపైకి తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలను తోసిపుచ్చారు. తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని కామెంట్స్ చేశారు. దీంతో లడ్డూ తయారీ విషయం చర్చనీయాంశంగా మారింది.
నిర్ధారణ అయింది - సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మరోసారి స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ విషయంలో విచారణ జరుగుతోందని.. బాధ్యులని శిక్షిస్తామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూని కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవరూ ఊహించలేక పోతున్నారని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీయటమే ధ్యేయంగా గత 5 ఏళ్ళు పని చేశారని విమర్శించారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తారంటూ కామెంట్స్ చేశారు.
“కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేసారు. ఇప్పుడు ఇవన్నీ సరి చేశాం. నాణ్యమైన ముడి సరుకు ఇచ్చి, పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
సిద్ధంగా ఉన్నా - మంత్రి లోకేశ్
ఇదే విషయంపై మంత్రి లోకేశ్ స్పందించారు. “సుబ్బారెడ్డి.. నేను తిరుపతిలోనే ఉన్నా.. ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా, మీరు రెడీనా? జగన్ నువ్వు వస్తావా..?” అంటూ సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడింది నిజమని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందని చెప్పారు. ఎవరైతే ఈ చర్య వెనుక ఉన్నారో, అందరి పైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
“దేవుడిపైనా జగన్ రెడ్డికి నమ్మకం లేదు. ప్రజలపైనా నమ్మకం లేదు.. ప్రజలు ఇచ్చిన తీర్పుపైనా నమ్మకం లేదు. ఆధారాలు చూపించాం.. ల్యాబ్ రిపోర్ట్ లు ముందు పెట్టాం. ఇంకా ఏమి నిరూపించాలి.. ? 50 ఏళ్ళ నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ని కాదని, వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ? ఇపుడు అసలు వాస్తవాలు బయట పడ్డాయి. మేము వాళ్ళని వదిలేది లేదు” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిందని టీటీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ లో నిర్ధారణ జరిగిందని చెప్పారు. జులై 8న శాంపిల్స్ ను ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని చెప్పుకొచ్చారు. దీనిపై లోతుగా విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
మొత్తంగా తిరుమల లడ్డూ తయారీ విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో వైసీపీ నేతలను టీడీపీ, బీజేపీ నేతలు టార్గెట్ చేస్తుండగా… అలాంటి తప్పిదమే జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయాల కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత మూడు 3 సంవత్సరాల నుండి స్వామివారి నైవేద్యానికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెయ్యితో సహా అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అని చెబుతున్నారు. స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు చేశామని వాదిస్తున్నారు. ప్రజలను తప్పుడుదారి పట్టించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.