Bandi Sanjay: విద్యార్థులతో మమేకమైన కేంద్ర మంత్రి బండి సంజయ్... సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు మందలింపు-union minister bandi sanjay who interacted with the students asked the problems and reprimanded the officials ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: విద్యార్థులతో మమేకమైన కేంద్ర మంత్రి బండి సంజయ్... సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు మందలింపు

Bandi Sanjay: విద్యార్థులతో మమేకమైన కేంద్ర మంత్రి బండి సంజయ్... సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు మందలింపు

HT Telugu Desk HT Telugu
Sep 20, 2024 08:36 AM IST

Bandi Sanjay: అన్నంలో రాళ్ళు వస్తున్నాయి... టాయిలెట్ లో నీళ్ళు రావడం లేదు.. స్పోర్ట్స్ పీరియడ్ లో గేమ్స్ ఆడించడం లేదని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి పిర్యాదు చేశారు. పిల్లలతో మంత్రి మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి అధికారులను మందలించారు.

ఏకలవ్య పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
ఏకలవ్య పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay: ఏకలవ్య రెసిడెన్షియల్ హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అధికారులను మంత్రి హెచ్చరించారు. ఫస్ట్ టైమ్ కాబట్టి వదిలేస్తున్నానని, మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు సమస్యలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి రోజు భోజనంలో రాళ్లు వస్తున్నాయని, వాష్ రూమ్స్ లేవని, టాయిలెట్లున్నా నీళ్లు రావడం లేదని, గేమ్స్ పీరియడ్ లో పీఈటీ లేరని, ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వడం లేదని, పాఠశాలకు ఫెన్సింగ్ లేదని విద్యార్థులు సమస్యలపై ఏకరువు పెట్టారు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే ఎట్లా?’ అని మంత్రి బండి సంజయ్ స్కూల్ ప్రిన్సిపల్, స్టాఫ్ ను ప్రశ్నించారు.

అన్నంలో ప్రతిరోజు రాళ్లు వస్తున్నయని విద్యార్థులంతా కలిసి బాధపడుతున్నారు... మన పిల్లలకు ప్రతిరోజు అన్నంలో రాళ్లు వస్తే తిన్పిస్తామా?.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మందలించారు. టాయిలెట్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి వదిలేశారు...నీళ్లే రావడం లేదు? ఏం చేస్తున్నారు? గేమ్స్ పీరియడ్ లో విద్యార్థులకు ఆటలు ఆడిపించడం లేదట... ఆట వస్తువులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇన్ని సమస్యలుంటే మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము కొత్తగా వచ్చామని, ఆ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్టాఫ్ చెప్పడంతో...బాధ్యులైన పాతవాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోకూడదనే ఆలోచించాలని కలెక్టర్ కు సూచించారు. ఇది తొలిసారి కాబట్టి వదలేస్తున్నానని, ఇకపై అట్లా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే రోజుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

తహశిల్దార్ ను అయి భూములు కాపాడుతా...

సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించడంతోనే ఇక్కడికి వచ్చానని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తానని బండి సంజయ్ తెలిపారు. బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని ఒక్కొక్కరిని అడుగుతూ వచ్చారు.

ఒకరు పోలీస్ అవుతా అంటే మరొకరు కలెక్టర్ ను అవుతానని ఇంకొకరు డాక్టర్ అవుతా. ఇంజనీర్ అవుతా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతా, ఆర్మీ ఆపీసర్ అవుతా....’’అంటూ విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఆకాశ్ అనే 9వ తరగతి విద్యార్థి ఎమ్మార్వో(తహిసిల్దార్) కావాలనుకుంటున్నానని చెప్పడంతో... కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని ‘ఎమ్మార్వో’నే ఎందుకు కావాలనుకుంటున్నవ్ అని అనడంతో ‘మా ఊళ్లో భూములన్నీ దోచుకుంటున్నారు సర్... నేను ఎమ్మార్వో అయ్యాక వాటన్నంటినీ కాపాడతా సర్’అని చెప్పడంతోపాటు భేష్ అని అభినందించారు. మరి ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించడంతో ఒక్కరూ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రాజకీయ నాయకుడంటే పరిస్థితి అట్లయిందని వ్యాఖ్యానించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి బండి సంజయ్ అప్పటికప్పుడు టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు.

దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్...

దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ మంజూరు చేస్తే... ప్రస్తుతం 410 స్కూల్స్ లో విద్యాబోధన కొనసాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెట్ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డి మండలం దూమాలలో ఏకలవ్య స్కూల్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలను సమకూర్చడంతోపాటు కాంప్రహెన్సివ్ కరిక్యులమ్ (సమగ్ర పాఠ్యాంశాలు)ను రూపొందించామని తెలిపారు.

దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన గిరిజన, ఆదివాసీలకు సకల సౌకర్యాలతో హైక్వాలిటీ ఎడ్యుకేషన్ (అత్యాధునిక విద్య)ను అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని తెలిపారు. 2018-19 ఆర్దిక సంవత్సరంలో ప్రతి బ్లాక్ పరిధిలో 50 శాతానికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి 2022లో కనీసం 20 శాతం ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు.

గిరిజన విద్యార్థులు చదువుకునే విధంగా సానుకూల పరిస్థితులను కల్పించడంతోపాటు చదువుకోగలమనే ధైర్యాన్ని కూడా అందించి ఇతర విద్యార్థులతో పోటీ పడేలా చేయడమే లక్ష్యంగా ఈ స్కూల్స్ ఏర్పాటయ్యాయని నవోదయ విద్యాలయాల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో స్కూల్ లో 480 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 1 లక్షా 26 వేల 626 మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ ఏకలవ్య స్కూల్స్ లో చదువుతున్నారని, తెలంగాణ విషయానికొస్తే.. 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే... అందులో 8309 మంది విద్యార్థులున్నారని తెలిపారు. వీరిలో 3927 మంది బాలురు, 4382 మంది బాలికలు చదువుకుంటున్నారని చెప్పారు.

ఒక్కో విద్యార్థికి రూ.1.09 లక్షల ఖర్చు...

ఒక్కో విద్యార్ధిపై సగటున ఏటా 1 లక్షా 9 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం 37 కోట్ల 80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని ఏకలవ్య స్కూల్స్ భవన నిర్మాణానికి 48 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. నగరాలు, పట్టణాల్లో మాదిరిగా అన్ని సౌకర్యాలతో అత్యాధునికమైన కార్పొరేట్ విద్యను అందించాలనే గొప్ప ఆశయంతో నరేంద్రమోదీ ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేశారని, అందుకు కావాల్సినన్ని నిధులను కూడా ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది? ఆశించిన ఫలితం నెరవేరుతోందా? విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? మెరుగైన విద్యను అందిస్తున్నారా? లేదా? ఇంకా విద్యార్థులకున్న సమస్యలేమిటి? వారు ఏం కోరుకుంటున్నారు? ఏమైనా డ్రాపవుట్స్ ఉన్నాయా? అనే అంశాలపై తెలుసుకోవాలని మోదీ ఆదేశించడంతో పాఠశాలలకు రావడం జరిగిందన్నారు. అధికారులు, విద్యార్థులు చెప్పిన విషయాలన్నీ నివేదిక రూపంలో ప్రధానమంత్రికి అందజేస్తామని తెలిపారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)