Hyderabad Traffic : సీఎం రేవంత్ వినూత్న నిర్ణయం - ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు, శిక్షణతో పాటు స్టైఫండ్-telangana cm revanth reddy suggests officials utilize services of transgenders as traffic volunteers in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic : సీఎం రేవంత్ వినూత్న నిర్ణయం - ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు, శిక్షణతో పాటు స్టైఫండ్

Hyderabad Traffic : సీఎం రేవంత్ వినూత్న నిర్ణయం - ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు, శిక్షణతో పాటు స్టైఫండ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 14, 2024 05:17 AM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ ను స్ట్రీమ్‌లైన్‌ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డ్స్‌ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని చెప్పారు. సమీక్ష సందర్భంగా యూనిఫామ్ నమూనా చిత్రాలను విడుదల చేశారు.

యూనిఫామ్ నమూనా చిత్రాలు
యూనిఫామ్ నమూనా చిత్రాలు

హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు.

ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలన్నారు. దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని చెప్పారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్​జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలన్నారు. విధుల్లో ఉండే ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.

ఇండోర్ తరహాలో అభివృద్ధి:

గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల వివరాలతో 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే జీఐఎస్, క్యూ ఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీలో నిధుల సమీకకరణకు స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలన్నారు.

మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలని చెప్పారు. అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున, స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు.

Whats_app_banner