AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రాబోయే మూడు రోజులు వర్షాలు-ap tg rains alert weather report next three days moderate to heavy rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రాబోయే మూడు రోజులు వర్షాలు

AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రాబోయే మూడు రోజులు వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 19, 2024 06:58 PM IST

AP TG Rains : నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రాబోయే మూడు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రాబోయే మూడు రోజులు వర్షాలు

AP TG Rains : నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రాబోయే మూడు రోజులు తేలికపాటు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు నవసారి, జలవావ్ , అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కాన్ గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ మీదుగా కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర, వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ ల్లోని పలు ప్రాంతాలు, బీహార్, జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంపై సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమ, పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది. రేపు(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

తెలంగాణలో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరించాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగైదు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి ఈ నెల 25 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్తొంది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వ్యవసాయ పనులు వారు, బయట పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్ పాటు ఆసిఫాబాద్‌, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం