AP Secretariat Employees: ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల మందు పార్టీ, కేసు నమోదు, క్యాంటీన్ ఎన్నికల్లో ప్రలోభాలు
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులు వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో జరుగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి,ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు.
AP Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులపై ఎక్సైజ్ శాఖ పోలీస్ కేసు నమోదు చేసింది. అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించడంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్స్‌లో మందు పార్టీ చేసుకుంటున్న ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో కొందరు డైరెక్టర్లను గెలిపించుకోడానికి సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేయడంతో అతనిపై ఎక్సైజ్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగులతో ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. లీకైన వీడియోల్లో తమ ప్యానల్‌ను గెలిపించాలని పలువురు అభ‌్యర్థులు ఉద్యోగుల్ని కోరడం కనిపించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు గార్డెన్‌లో ఏర్పాటు చేసిన టేబుళ్లపై మద్యం సేవిస్తూ కనిపించారు.
ఏపీ సెక్రటేరియట్ క్యాంటిన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్‌లో గురువారం రాత్రి ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ విందులో పరిమితికి మించి మద్యాన్ని సమకూర్చారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం... ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేకుండానే మద్యంతో విందు జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులకు గురు వారం రాత్రి 11 గంటల సమయంలో దాడులు చేశారు. తాడేపల్లి పోలీసులతో కలిసి కొండపావులూరి గార్డెన్స్‌లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను గుర్తించారు.
పార్టీలో ఉన్న వారంతా సెక్రటేరియట్‌లో వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు అధికారులు కావడంతో ఎక్సైజ్ సిబ్బందిపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. ప్రైవేట్ పార్టీలో తప్పేముందని నిలదీశారు. పరిమితికి మించి మద్యం వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన గురించి వివరించడంతో ఉద్యోగులు వెనక్కి తగ్గారు. కేసు నమోదవుతుందని తెలియడంతో తమకేమి తెలియదని జారుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే పార్టీలో ఉన్న వారందరిని పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది వీడియోలు తీయడంతో చేతులెత్తేశారు.
వెంకట్రామిరెడ్డి డిన్నర్ పార్టీ అని ఆహ్వా నిస్తే వచ్చామని చెప్పడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్నారు.
ఏపీ సచివాలయం క్యాంటీ న్ ఎన్నికల్లో డైరెక్టర్ పదవుల్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీ పడుతున్నారు. వెంకట్రామిరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీ చేస్తున్నారు. సచివాలయంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికలు కావడంతో ప్రత్యర్థులు నిఘా ఉంచి పోలీసులకు సమాచారం అందించారు.
వెంకట్రామిరెడ్డిపై వైసీపీ అనుకూలుడిగా ముద్ర ఉండటంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో గెలిపిస్తే క్యాంటీన్‌లో శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేకంగా భోజన సదుపాయం, క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకొస్తామని, భోజన నాణ్యత పెంచుతామని చెప్పారు. సెక్రటేరియట్ క్యాంటీన్‌లో ఉద్యోగులకు అందించే భోజనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ చెల్లిస్తుంది. దీంతో ఈ పదవులకు బాగా డిమాండ్ ఉంది.