AP Liquor Prices: ఏపీలో తగ్గిన మద్యం ధరలు, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 తగ్గించిన ప్రముఖ బ్రాండ్లు, మరింత తగ్గే అవకాశం-ap liquor prices slashed popular brands cut quarter bottle rates by rs 30 further reductions expected ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Prices: ఏపీలో తగ్గిన మద్యం ధరలు, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 తగ్గించిన ప్రముఖ బ్రాండ్లు, మరింత తగ్గే అవకాశం

AP Liquor Prices: ఏపీలో తగ్గిన మద్యం ధరలు, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 తగ్గించిన ప్రముఖ బ్రాండ్లు, మరింత తగ్గే అవకాశం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 29, 2024 05:46 AM IST

AP Liquor Prices Slashed: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పాత ధరలనే అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర‌్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రముఖ బ్రాండ్లు మద్యం ధరల్ని తగ్దించుకున్నాయి.

ఏపీలో బారీగా తగ్గిన మద్యం ధరలు
ఏపీలో బారీగా తగ్గిన మద్యం ధరలు (istockphoto)

AP Liquor Prices Slashed: ఏపీలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదేళ్లుగా చుక్కలనంటుతున్న మద్యం ధరలతో ఖజానాకు భారీగా ఆదాయం వస్తున్న ప్రజల జేబులకు మాత్రం భారీగా చిల్లు పడుతోంది. 2019 జూన్‌ ధరలతో పోలిస్తే 2024 జూన్‌కు మద్యం ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఏపీలో అక్టోబర్ 16నుంచి ప్రైవేట్‌ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో వేలంలో దక్కించుకున్న వారి ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో కొత్తగా రూ.99 బ్రాండ్‌‌ను తీసుకొచ్చిన మిగిలిన బ్రాండ్ల ధరలను మాత్రమే పాత ధరలనే కొనసాగించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనం జగన్‌ బాటలోనే చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోందని గొణుక్కుంటూ మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మద్యం ధరలపై ఇప్పటికే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక రావడానికి ముందే ధరలు తగ్గుముఖం పట్టడం చర్చనీయాంశంగా మారింది. .

రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు పాపులర్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్‌ శాఖ వాటి ఆమోదం తెలిపింది. తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ప్రస్తుతం దుకాణాల్లో పాత ఎమ్మార్పీలతో ఉన్న బాటిళ్లను ఆ ధరలకే విక్రయిస్తారు. కొత్తగా వచ్చే స్టాకును తగ్గించిన ధరలతో అమ్ముతారు. ఏపీలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు.

వీటి ధరలు తగ్గాయి.

ధరలు తగ్గిన బ్రాండ్లలో మాన్షన్‌ హౌస్ ఒకటి. 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి క్వార్టర్‌ రూ.110 ఉన్న మద్యాన్ని వైసీపీ హయంలో ఓ దశలో రూ.300కు విక్రయించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ధరలు తగ్గించి చివరకు రూ.220కు ఫిక్స్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాన్షన్‌ హౌస్‌ బ్రాందీ క్వార్టర్‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. అదే బ్రాండ్‌ హాఫ్‌ బాటిల్‌ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్‌ బాటిల్‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గించారు.

రాయల్‌ చాలెంజ్‌ సెలెక్ట్‌ గోల్డ్‌ విస్కీ క్వార్టర్‌ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఇదే బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గించారు. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.

అన్ని బ్రాండ్లపై కొత్త ధరలు…

మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై సిఫారసు చేయనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకుంటున్నాయి. మరో రెండు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో ధరలు తగ్గించనున్నాయి.

హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది. బాటిల్‌ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించనుంది. ఏపీ, తెలంగాణలో విక్రయించే బ్రాండ్ల ధరల్లో భారీ వ్యత్యాసాలుంటే వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ధరలు తగ్గిస్తున్నాయని చెబుతున్నారు.

వైసీపీని చావు దెబ్బ తీసిన మద్యం బ్రాండ్లు…

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంలో మద్యం కూడా కీలక పాత్ర పోషించింది. సంపూర్ణ మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ చివరకు మద్యం అమ్మకాలతో అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలకు లింకు పెట్టి మద్యం అమ్మకాలు సాగించాడు.

మద్యం ధరలు గణనీయంగా పెరగడం, నాణ్యత లేకపోవడం, ఊరు పేరు లేని బ్రాండ్ల విక్రయాలను జే బ్రాండ్లుగా ప్రచారం చేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. మద్యం ధరలు భారీగా పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా 2019తో పోలిస్తే రెట్టింపైంది.

మద్యంపై విధించే పన్నులు..

మద్యం ఉత్పత్తి సంస్థలు నేరుగా విక్రయించే అవకాశం లేకపోవడంతో తమ మద్యాన్ని ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్‌కు సరఫరా చేస్తుంటాయి. మద్యం గరిష్ట ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. డిస్టిలరీలు ప్రభుత్వానికి సరఫరా చేసే ధరను బేసిక్‌ ధరగా పరిగణిస్తారు. ఈ ధరపై ఎక్సైజ్‌ డ్యూటీ విధిస్తారు. ఆ మొత్తానికి స్పెషల్‌ మార్జిన్‌, హోల్‌సేల్‌ ట్రేడ్‌ మార్జిన్‌ విధిస్తారు. ఈ పన్నులన్నీ విధించిన తర్వాత వచ్చేదానిపై వ్యాట్‌ వసూలు చేస్తారు. ఈ మొత్తం ధరపై 20 శాతం రిటైలర్‌ మార్జిన్‌ విధిస్తారు. ఈ మొత్తంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌ వేస్తారు. పన్నులన్నీ కలిపిన తర్వాత కొనుగోలుదారుడికి అందించే ధరను ఎమ్మార్పీగా ముద్రిస్తారు.

మద్యం ఉత్పాదక ధరతో పోలిస్తే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులే అధికంగా ఉంటున్నాయి. వైసీపీ హయంలో రకరకాల పేర్లతో మద్యం ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. మద్యం బేసిక్‌ ధర ఆధారంగా అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌ విధిస్తారు. ఇలా వసూలు చేసే పన్ను ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 137 శాతం నుంచి 226 శాతం వరకు ఉంటుంది. కొన్ని బ్రాండ్లపై ఉత్పాదక వ్యయం కంటే అధికంగా పన్నులు చెల్లిస్తున్నారు. బీర్లపై 211శాతం, వైన్‌పై 187శాతం, రెడీ టు డ్రింక్స్‌పై 39శాతం వసూలు చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం