AP Inter Certificates : వరదల్లో ఇంటర్ సర్టిఫికెట్లు కోల్పోయారా? ఇలా ఉచితంగా పొందండి
AP Inter Certificates : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ బోర్డు సర్టిఫైడ్, డూప్లికేట్ సర్టిఫికెట్ల ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు వారు చదివిన కాలేజీ లేదా జిల్లా అధికారులు సంప్రదించవచ్చు.
ఏపీలో ఇటీవల భారీ వరదలకు ఇళ్లు నీట మునిగి లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుడమేరు పొంగడంతో విజయవాడ వరద ముంపునకు గురైంది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో చాలా మంది కట్టుబట్టలతో బయటపడ్డారు. చాలా మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన వారందరికీ ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు, డూప్లికేట్ సర్టిఫికెట్లను అందిస్తామని ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది.
ఎవరికి దరఖాస్తు చేసుకోవాలంటే?
ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. వరదల్లో ఇంటర్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. ఈ సమాచారాన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఐవోలు, డీఐఈవోలు ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ల కాపీల కోసం వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేదా నేరుగా ఇంటర్ బోర్డు అధికారులను కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు
ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల తరహాలో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డుల నమూనాను ఆయా కాలేజీలకు పంపించారు. అయితే ఇంటర్ వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు తెలుపు రంగు, రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు లేత పసుపు, సెకండియర్ వారికి లేత నీలం రంగు కార్డులను ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రశ్నపత్రాల్లో మార్పులు చేస్తామన్నారు.
అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. సెకండియర్ విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు రోజుకోకటి చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
సంబంధిత కథనం