AP Inter IIT NEET Free Coaching : ఏపీ ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్- ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!-ap inter board decided to give free iit neet coaching to govt jr colleges with narayana staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Iit Neet Free Coaching : ఏపీ ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్- ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!

AP Inter IIT NEET Free Coaching : ఏపీ ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్- ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!

Bandaru Satyaprasad HT Telugu
Oct 02, 2024 02:48 PM IST

AP Inter IIT NEET Free Coaching : ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. నారాయణ సిబ్బందితో ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్ ఇస్తామని ప్రకటించింది. తొలిదశలో నాలుగు ముఖ్య పట్టణాల్లో ఈ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.

ఏపీ ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్- ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!
ఏపీ ఇంటర్ విద్యార్థులు గుడ్ న్యూస్- ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్! (Pexels)

ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్‌ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొదటి విడతలో రాష్ట్రంలోని నాలుగు ముఖ్య పట్టణాల్లో ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో ఎంపిక చేసిన కాలేజీల్లో... అక్కడి జూనియర్ లెక్చరర్లు విద్యార్థులకు ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు. ఈసారి నారాయణ కాలేజీలకు చెందిన ఐఐటీ, నీట్‌ సిలబస్‌ బోధించే సిబ్బందితో ఈ శిక్షణ ఇప్పించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

నాలుగు పట్టణాల్లో కేంద్రాలు

మొదటి విడతలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఈ నగరాలకు 5 లేదా 10 కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచితంగా నీట్, ఐఐటీ శిక్షణ ఇస్తారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్‌లో ఇంటర్‌ రెగ్యులర్‌ తరగతులతో పాటు ఐఐటీ, నీట్‌ శిక్షణను పొందుతారు. ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తారు. దీంతో అటెండెన్స్‌ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

గతంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు ఇలాంటి తరహాలో నీట్, ఐఐటీ శిక్షణను ఇంటర్‌ బోర్డు ఇచ్చింది. ఆసక్తి ఉన్న ప్రభుత్వ లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. అయితే ఈ విధానం అంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చారు. ఆసక్తి గల విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి ఐఐటీ, నీట్‌ శిక్షణను నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఇస్తారు.

ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల తరహాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డుల నమూనాను ఆయా కాలేజీలకు పంపించారు. అయితే ఇంటర్‌ వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు తెలుపు రంగు, రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు లేత పసుపు, సెకండియర్ వారికి లేత నీలం రంగు కార్డులను ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రశ్నపత్రాల్లో మార్పులు చేస్తామన్నారు.

అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. సెకండియర్ విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు రోజుకోకటి చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Whats_app_banner

సంబంధిత కథనం