AP Home Minister : పవన్ కామెంట్స్‌పై స్పందించిన హోంమంత్రి అనిత.. చాలా టాస్క్‌లు ఉన్నాయని రిప్లై!
AP Home Minister : ఏపీలో శాంతిభద్రతల అంశంపై పొలిటికల్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. హోంమంత్రిగా తాను విఫలమయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదని చెప్పుకొచ్చారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయని వ్యాఖ్యానించారు.
అనంతపురం జిల్లా పర్యటనలో హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. నేరస్తులు దొరక్కుండా అప్‌డేట్ అవుతున్నారని చెప్పారు.
'హోం మంత్రిగా నేను విఫలమయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదు. పవన్ మాటలను బాధ్యతగా తీసుకుని కలిసి పనిచేస్తాము. మా ముందు చాలా టాస్క్‌లు ఉన్నాయి. జిల్లాకో సోషల్‌మీడియా పీఎస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాము. అప్పాను కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేయాలి' అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.
ఇష్టమొచ్చినట్లు రౌడిల్లా వైసీపీ వ్యక్తులు వ్యవహరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? అని హోంమంత్రి అనితను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? అని నిలదీశారు. మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించండి అంటూ సూచించారు.
'నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. హోమ్ శాఖ మంత్రిని కాదు. పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోమ్ శాఖ తీసుకుంటాను. నేను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తాను. డీజీపీ గత ప్రభుత్వంలా వ్యవహరించకూడదు. బాధ్యత తీసుకోండి. పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను. ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలి.' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
'క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది. అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా.. శాంతి భద్రతలు కీలకమైనవి. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ కూడా స్పందించారు. 'సీఎం, డిప్యూటీ సీఎంకు పోర్ట్ ఫోలియోలపై స్పందించే స్వేచ్ఛ ఉంటుంది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాలి. సీఎం చంద్రబాబు అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరు' అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.