Review On Coivd : కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై సీఎం జగన్ సమీక్ష - ముందస్తు చర్యలకు ఆదేశాలు-ap cm ys jagan review on covid situations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Review On Coivd : కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై సీఎం జగన్ సమీక్ష - ముందస్తు చర్యలకు ఆదేశాలు

Review On Coivd : కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై సీఎం జగన్ సమీక్ష - ముందస్తు చర్యలకు ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 22, 2023 04:23 PM IST

CM Jagan Review On Coivd : కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్షించారు. కొవిడ్‌ టెస్టులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

సీఎం జగన్ సమీక్ష
సీఎం జగన్ సమీక్ష

CM Jagan Review On Coivd : ఏపీలో కొవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు.గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ టెస్టులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ పలు ముఖ్యాంశాలను తెలిపింది. కొవిడ్ కొత్త వేరియంట్ JN.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ వేరియంట్ సోకినవారు కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు JN.1కు లేవని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,741 ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల్లో.. ఏలూరులో ఒక కరోనా పాజిటివ్ నమోదయ్యింది. కొత్త వేరియంట్ అలర్ట్‌‌తో ఆరుగురికి ర్యాండమ్‌గా టెస్ట్‌లు నిర్వహించారు. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ గా పాజిటివ్‌గా తేలింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 16 కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కరోనా నుంచి ఒకరు రికవరీ కాగా, 19 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

80 శాతం కేరళలోనే..

భారత్ లో ప్రస్తుతం ఉన్న మొత్తం కొరోనా యాక్టివ్ కేసుల్లో 80% ఒక్క కేరళలోనే నమోదు కావడం గమనార్హం. కేరళలో గురువారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 275 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 68,37,689 కి పెరిగింది. అంతకుముందు, 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 300 కొత్త కోవిడ్-19 (Covid-19) కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణాజార్జి వైద్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19ను ఎదుర్కొనే విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని, కొవిడ్ ప్రొటోకాల్ అందరూ పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో శుక్రవారం 640 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దాంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,669 నుండి 2,997 కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడినవారి సంఖ్య 4.50 కోట్లకు పైగా ఉంది. అలాగే, కోవిడ్ 19 తో మరణించిన వారి సంఖ్య 5,33,328కి చేరుకుంది. అలాగే, రికవరీల సంఖ్య 4,44,70,887కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.81% గా ఉంది. మరణాల రేటు 1.19% వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Whats_app_banner