TS Covid Cases : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు - కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే-telangana reported four new cases of covid on tuesday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Covid Cases : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు - కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే

TS Covid Cases : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు - కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 20, 2023 09:29 AM IST

Covid Cases in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 4 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో కొత్త కొవిడ్ కేసులు
తెలంగాణలో కొత్త కొవిడ్ కేసులు

Covid Cases in Telangana : దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

మంగళవారం మొత్తం 402 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 మంది కరోనా చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇవాళ్టి నుంచి మళ్లీ విరివిగా కరోనా టెస్టులను పెంచనుంది ప్రభుత్వం.

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 వెలుగుచూసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్ లో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. క్యాజువాలిటీ వార్డు వెనకవైపున 50 పడకలతో ఐసోలేషన్‌ వార్డు, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు.

కరోనా పరిస్థితులపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలన్నారు.

వరంగల్‌లో కరోనా, ఒమిక్రాన్‌ను పకడ్బందీగా ఎదుర్కొనగా.. కొత్త వేరియంట్ నేపథ్యంలో మరోసారి అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో డాక్టర్ ల ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి కొత్త వేరియంట్ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,828కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు.కోవిడ్ కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. గతంలో కోవిడ్-19, ఒమిక్రాన్ వ్యాప్తి సమయంలో ఎంజీఎంలో మొత్తం 250 బెడ్ల సామర్థ్యంతో ప్రత్యేక వార్డును వైరస్ బాధితుల కోసమే కేటాయించారు.

Whats_app_banner