Damodar Raja Narasimha : గెలిస్తే పవర్... ఓడితే ప్రతిపక్షం - కాంగ్రెస్ లో 'దామోదర' సెంటిమెంట్-damodar raja narasimha won an assembly election the congress party came to power ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Damodar Raja Narasimha : గెలిస్తే పవర్... ఓడితే ప్రతిపక్షం - కాంగ్రెస్ లో 'దామోదర' సెంటిమెంట్

Damodar Raja Narasimha : గెలిస్తే పవర్... ఓడితే ప్రతిపక్షం - కాంగ్రెస్ లో 'దామోదర' సెంటిమెంట్

HT Telugu Desk HT Telugu
Dec 06, 2023 09:45 AM IST

Telangana Congress News: కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ గెలిచిన ప్రతిసారి… ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఓడిపోయినప్పుడు మాత్రం…ప్రతిపక్షంలో కూర్చుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన గెలవటం… కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఆసక్తికరంగా మారింది.

దామోదర రాజనరసింహ
దామోదర రాజనరసింహ (Twitter)

Damodar Raja Narasimha: మెదక్ జిల్లా నుంచి అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సిలారపు దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ గాలి బలంగా వీసినప్పుడే గెలుస్తాడని ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. దానికి నిదర్శనంగా, దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లాలోని అందోల్ (ఎస్సి రిజర్వ్డ్) నియోజకవర్గం నుండి గెలిసిన నాలుగు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాను ఓడిపోయినా ఐదు సార్లు, కాంగ్రెస్ అసెంబ్లీ లో ప్రతి పక్షంలో కూర్చున్నది. అందోల్ నుంచి అంతకుముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి, మంత్రిగా కూడా పనిచేసిన దామోదర్, తన తండ్రి రాజనరసింహ పేరును పెట్టుకొని, తండ్రి మరణాంతరం తొలిసారి1989లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిసి అలవోకగా గెలిచాడు. అప్పటివరకు, ఆరు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి (టీడీపీ) బలమైన వ్యతిరేఖ పవనాలు వీస్తుండటంతో, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 180 పైగా సీట్లు వచ్చాయి. ఈ గాలిలో దామోదర కూడా మొట్టమొదటి సారి ఎన్నికల్లో గెలిసి అసెంబ్లీ లో అడుగు పెట్టాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 1994 ఎన్నికల్లో, 1998 ఉపఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో కూడా ఓటమి మూటగట్టుకొని ఇంటికే పరిమితమయ్యాడు.

1994 నుండి 2004 వరకు టీడీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. తరవాత, టీడీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉండటంతో, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, వామపక్షాలతో జట్టు కట్టి ఈ ఎన్నికలు అలవోకగా గెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో, దామోదర్ 10 సంవత్సరాల తరవాత, మూడు ఓటముల తర్వాత, మల్లి అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, రెండోసారి అసెంబ్లీ లో అడుగుపెట్టాడు. తొలిసారిగా మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. 2009 ఎన్నికల సమయంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేఖత లేకపోవడంతో, మరొకసారి కాంగ్రెస్ పార్టీ గెలిసింది. ఎన్నికల అనంతరం, రెండోసారి ముఖ్యమంత్రి అయినా రాజశేఖర్ రెడ్డి, నాలుగు నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. తన మరణాంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దామోదరకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. 2014 లో తెలంగాణ వచ్చేవరకు, దామోదర్ ఆ పదవిలో కొనసాగాడు.

తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ, తాను ఓటమి పాలయ్యాడు. 2014 లో టీఆర్ఎస్ టికెట్ పైన పోటీచేసిన బాబూమోహన్ చేతిలో ఓటమిపాలవ్వగా, 2018 ఎన్నికల్లో అదే పార్టీ నుండి పోటీచేసిన చంటి క్రాంతి కిరణ్ చేతిలో పరాజయం చవిచూశాడు. తన వయసు పెరుగుతుండటంతో, కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు బలంగా మారుతుండటంతో, ఇక దామోదర్ మల్లి అసెంబ్లీలో అడుపెడతాడా అనే అనుమానం తన అభిమానుల్లో పేరుకుపోయింది. ఆ అనుమానాలు అన్ని పటాపంచలు చేస్తూ, కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న సమయంలో అందోల్ నుండి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ శాసన సభలోకి తొలిసారి అడుగు పెట్టనున్నాడు. కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తంలో మీద మూడు సీట్లే గెలవటం, అందులో నారాయణఖేడ్ లో గెలిసిన పట్లోళ్ల సంజీవ రెడ్డి, మెదక్ నుండి గెలిసిన మైనంపల్లి రోహిత్ రావు తొలిసారి గెలవటంతో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడనున్నకాంగ్రెస్ ప్రభుత్వంలో తాను మంత్రి కావడం ఇక లాంఛనమే.

రిపోర్టింగ్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి

Whats_app_banner