Warangal Updates: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
Warangal Updates: కేరళలో కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్-1 తో ఒక వ్యక్తి చనిపోవడంతో తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలెర్ట్ అయింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ గాంధీతో పాటు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
Warangal Updates: వరంగల్‌లో కరోనా, ఒమిక్రాన్‌ను పకడ్బందీగా ఎదుర్కొనగా.. కొత్త వేరియంట్ నేపథ్యంలో మరోసారి అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో డాక్టర్ ల ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి కొత్త వేరియంట్ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,828కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు.
ఎంజీఎంలో 50 బెడ్లతో స్పెషల్ వార్డు
కోవిడ్ కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. గతంలో కోవిడ్-19, ఒమిక్రాన్ వ్యాప్తి సమయంలో ఎంజీఎంలో మొత్తం 250 బెడ్ల సామర్థ్యంతో ప్రత్యేక వార్డును వైరస్ బాధితుల కోసమే కేటాయించారు.
ప్రతి బెడ్ కి ఆక్సిజన్ అందించేందుకు ఆసుపత్రి ఆవరణలోనే రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి సేవలందించారు. వెంటిలేటర్లు కూడా రిపేర్ చేయించి పేషెంట్ లకు ట్రీట్మెంట్ అందించారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో ఆ వార్డును ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
ఇటీవల కొత్తగా జేఎన్-1 వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఎంజీఎం అధికారులు మరోసారి స్పెషల్ వార్డు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్ బెడ్స్, మరో 10 సాధారణ బెడ్లు ఏర్పాటు చేసి మొత్తం 50 పడకల కోవిడ్ వార్డును కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు.
ఈ మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పరశురామ్ నేతృత్వంలో ఆర్ఎంవోలు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కొత్త వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు
జేఎన్-1 వేరియంట్ కేసులు కేరళ రాష్ట్రంలో నమోదు అవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయడంతో పాటు అందులో పాజిటివ్ వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ను నిర్ధారించుకోవడానికి తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు కూడా ఇచ్చింది.
దీంతో అధికారులు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచేందుకు చర్యలు చేపట్టారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంజీఎం లో సుమారు 560 వరకు టెస్టులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అందులో ఏ ఒక్కరికి కూడా కరోనా నిర్ధారణ కాలేదని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. కాగా కొత్త వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండగా.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)