Covid 19 JN.1: కొత్త కరోనా వేరియంట్ JN.1 వ్యాప్తి, ఈ వేరియంట్‌తో ఎవరు జాగ్రత్తగా ఉండాలి?-outbreak of new corona variant jn 1 who should be careful with this variant ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Covid 19 Jn.1: కొత్త కరోనా వేరియంట్ Jn.1 వ్యాప్తి, ఈ వేరియంట్‌తో ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

Covid 19 JN.1: కొత్త కరోనా వేరియంట్ JN.1 వ్యాప్తి, ఈ వేరియంట్‌తో ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

Haritha Chappa HT Telugu
Dec 21, 2023 10:02 AM IST

Covid 19 JN.1: కొత్త కరోనా వేరియంట్ వచ్చేసింది. మన దేశంలో JN.1 కేసులు పెరుగుతున్నాయి.

కొత్త కరోనా వేరియంట్
కొత్త కరోనా వేరియంట్ (pixabay)

Covid 19 JN.1: కొన్ని నెలలుగా కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకరాకపోవడంతో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కొత్త సబ్ వేరియంట్ JN.1 బయటపడింది. ఈ వేరియంట్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా, చైనా, సింగపూర్లో ఈ సబ్ వేరియంట్ వ్యాపిస్తుంది. ఇప్పుడు మనదేశంలో కూడా ఈ JN.1 ప్రవేశించింది. తొలిసారి కేరళలో ఒక వృద్ధురాలిలో ఈ JN.1 బయటపడింది. ప్రస్తుతం మన దేశంలో మూడు రాష్ట్రాల్లో ఈ JN.1 కేసులు ఉన్నట్టు గుర్తించారు. అత్యధికంగా గోవాలో 19 కేసులు నమోదయ్యాయి. అలాగే కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్క కేసులు బయటపడ్డాయి.

JN.1 ఎవరికి సోకుతుంది?

ప్రభుత్వ ఆరోగ్యశాఖ చెబుతున్న ప్రకారం JN.1 సోకినప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని RTCPR పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ఇది సోకినా కూడా పెద్దగా లక్షణాలు బయటపడవు. ఈ వైరస్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. ముక్కు కారడం, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. జీర్ణకోశ సమస్యలు కూడా రావచ్చు. అంతకుమించి ఈ కరోనా వేరియంట్‌లో కనిపించే తీవ్రపాటి లక్షణాలు ఏమీ ఉండవు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. ఇంట్లోనే తగిన మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ముసలివారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, పిల్లలకు ఈ వేరియంట్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తోంది. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌గానే JN.1 గుర్తించారు. కరోనా స్పైక్ ప్రోటీన్ లో మ్యుటేషన్ వల్ల కొత్తగా ఈ JN.1 పుట్టుకొచ్చింది. ఒకరి నుంచి మరొకరికి సోకడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కులు వాడడం చేయాలి. అలాగే సామాజిక దూరాన్ని పాటించాలి. రెండు డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిది.

మూడేళ్ల నుంచి కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వేధిస్తోంది. గత మూడేళ్లలో లక్షల మంది దీని కారణంగా మరణించారు. మన దేశం విషయానికి వస్తే ఈ మూడేళ్లలో నాలుగున్నర కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ఐదున్నర లక్షల మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది.

చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే సమయం. అందులోనూ ఇది ప్రయాణాల సీజన్‌. క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతికి సెలవులు అధికంగా వస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ కొత్త వేరియంట్లు అధికంగా ప్రబలే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

Whats_app_banner