Tirumala Brahomostavalu 2024 : శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న సియం చంద్రబాబు దంపతులు. వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్లారు. సతీసమేతంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో ముఖ్యమంత్రి దంపతులకు స్వామివారి టీటీడీ ఈవో శేష వస్త్రం, చిత్ర పటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. 2025 క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున అతి ఎక్కువసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం తనకే దక్కిందని చెప్పుకొచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1.25 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు- శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 3 లక్షలు, 6 షిట్ క్యాలెండర్లు 50 వేలు, టీటీడీ స్థానిక ఆలయాలు 10 వేలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను ముద్రించింది. కాగా 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అక్టోబరు 5వ తేదీ నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు ప్రకటించారు.
వైభవంగా ధ్వజారోహణ ఘట్టం…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
పెద్ద శేషవాహనంపై విహరించిన మలయప్పస్వామి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా… మొదటిరోజు(శుక్రవారం) రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనం (పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధులలో వివాహరించారు. రాత్రి 9 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది.
శనివారం(రేపు) ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.