Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆగస్టు 28న ఆర్జిత సేవల రద్దు-బ్రహ్మోత్సవాల్లో దాతలకు వసతి లేదు
Tirumala : తిరుమలలో ఈ నెల 27, 28న గోకులాష్టమి ఆస్థానం, ఉట్లోత్సవం నిర్వహించనుంది టీటీడీ. ఉత్సవాల దృష్ట్యా ఆగస్టు 28న సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను రద్దు చేసింది. అలాగే అక్టోబర్ 4 నుంచి 12 వరకు దాతలకు వసతి కల్పించలేమని ప్రకటించింది.
Tirumala : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో దాతలకు టీటీడీ వసతి లేదని తెలిపింది. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు టీటీడీ అందించే వసతి ఉండదని, ఈ విషయాన్ని గమనించి దాతలు సహకరించాలని కోరింది.
దాతలకు వసతి లేదు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే సాధారణ భక్తుల వసతికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో దాతలకు ఎటువంటి వసతి కల్పించలేమని టీటీడీ పేర్కొంది. వివిధ ట్రస్టులు, పథకాల ద్వారా తిరుమల శ్రీవారికి దాతలు కానుకలు అందిస్తుంటారు. అయితే సాధారణంగా టీటీడీ దాతలకు తిరుమలలో వసతి కల్పిస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ కారణంగా దాతలకు వసతి సౌకర్యం కల్పించలేమని తెలిపింది. అయితే అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా...బ్రహ్మోత్సవాల సమయంలో దాతలు వారికి ఉన్న విశేషాధికారాల మేరకు దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. దాతలందరూ ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం, ఉట్లోత్సవం
ఆగస్టు 27న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో టీటీడీ గోకులాష్టమి ఆస్థాన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఉత్సవాల్లో భాగంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ముఖ మండపంలో శ్రీకృష్ణ స్వామి సర్వ భూపాల వాహనంపై ఆశీనులై ఉగ్ర శ్రీనివాస ఉత్సవ మూర్తులకు ఏకాంత స్నపన తిరుమంజనం నిర్వహించి ద్వాదశారాధన నిర్వహిస్తారు.
ఆగష్టు 28న శ్రీ మలయప్ప స్వామి, శ్రీ కృష్ణ స్వామి ఇద్దరికీ మాడవీధుల్లో బంగారు తిరుచ్చి వాహన సేవను నిర్వహించనున్నారు. దీనిలో స్థానిక యువకులు, భక్తులు ఉత్సాహంతో సంప్రదాయ కుండలు పగలగొట్టే విన్యాసం ఉట్లోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల దృష్ట్యా ఆగస్టు 28న సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్
- అక్టోబర్ 4 : శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది.
- అక్టోబర్ 5 : శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.
- అక్టోబర్ 6 : ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ముత్యపుపందిరిలో స్వామివారు విహరిస్తారు.
- అక్టోబర్ 7 : సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు కల్పవృక్షం సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వ భూపాల సేవ నిర్వహిస్తారు.
- అక్టోబర్ 8 : మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది.
- అక్టోబర్ 9: బుధవారం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.
- అక్టోబర్ 10 : గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
- అక్టోబర్ 11 : శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
- అక్టోబర్ 12 : శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
సంబంధిత కథనం