TG Govt Job Calendar : అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల - పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు, ముఖ్య వివరాలివే
Telangana Govt Job Calendar 2024: అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. ఈ మేరకు పలు ముఖ్యమైన వివరాలను తెలిపింది.
TG Govt Job Calendar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వేదికగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరాలను వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలను పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో జరగనున్నాయి. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి.
ఇక హెల్త్ డిపార్ట్ మెంట్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల కాగా... నవంబర్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ ఎగ్జామ్స్ మేలో జరగనున్నాయి. అయితే ఈ పోస్టుల సంఖ్యను మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు.
బీఆర్ఎస్ నిరసన
జాబ్ క్యాలెండర్ పై చర్చకు పట్టుబట్టింది బీఆర్ఎస్. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ లో పోస్టుల సంఖ్యను తెలపలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అంతకుముందు సభలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై చర్చజరగగా… దానం నాగేందర్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన పలు అనుచిత వ్యాఖ్యలను చేశాడు. బయట తిరగనివ్వను అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యంతో మళ్లీ మాట్లాడిన దానం…. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.