AP Cabinet Meeting : ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు..!-ap cabinet will meet on october 16 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Meeting : ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు..!

AP Cabinet Meeting : ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 12, 2024 07:44 AM IST

ఏపీ కేబినెట్ అక్టోబర్ 16వ తేదీన భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. చెత్తపన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టంతో పాటు సంబంధిత జీవోల వంటి మరికొన్ని కీలక అంశాలపై చర్చించనుంది.

ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అక్టోబర్ 10వ తేదీన కేబినెట్ భేటీ జరిగినప్పటికీ…. అజెండాలోని అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదు. పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మృతికి నివాళులు అర్పించి ముగించారు. వెంటనే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు… ముంబైకి వెళ్లారు. దీంతో కేబినెట్ భేటీ అంసపూర్తిగా జరిగింది.

ఈ క్రమంలోనే… అక్టోబర్ 16వ తేదీన ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భేటీలో చర్చించి, ఆమోదించాల్సిన అంశాలపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు.

కీలక అంశాలపై చర్చ…!

ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీపావ‌ళికి సూప‌ర్ సిక్స్‌లో భాగ‌మైన మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు అమ‌లు చేస్తామ‌ని ఇప్ప‌టికే క‌ర్నూలు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. క‌నుక రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ అంశంపై ఒక నిర్ణ‌యం తీసుకోనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చెత్త పన్ను రద్దు అంశంపై చర్చించి… మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టం, దానికి అనుబంధంగా వివిధ శాఖలు జారీ చేసిన జీవోలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో జీవోలు ఉంచటం వంటివి చర్చకు రావొచ్చని సమాచారం. అలాగే జ‌ల్ జీవ‌న్ మిష‌ణ్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణం వంటి అంశాల‌పై రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో చ‌ర్చ జ‌ర‌గే అవకాశం ఉంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపైనా ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మరికొన్ని కీలక నిర్మయాలు ఉండొచ్చని సమాచారం.

రాష్ట్ర శాసనసభ నిర్వహణపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 6 వేల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనిపై ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner