AP Cabinet Decisions: డిఎస్సీ నియామకాలు, ల్యాండ్ టైట్లింగ్ రద్దు,పెన్షన్ల పెంపుకు క్యాబినెట్ అమోదం
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అమోద ముద్ర వేసింది. డిఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెంచిన పెన్షన్లను జూలై1న సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారు.
AP Cabinet Decisions: చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మొదటి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. క్యాబినెట్ మీటింగ్‌లో అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించేలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నిర్ణయించారు. ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చిందని ప్రకటించారు.
మెగా డిఎస్సీకి అమోదం…
గత ప్రభుత్వం సివిల్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దృష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు.గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు.
చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
డిఎస్సీకి టెట్ తప్పనిసరి అని తెలిసినా, ఆర్నెల్లకు ఓసారి టెట్ నిర్వహించకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయేలా గత ప్రభుత్వంలో వ్యవహరించారని మంత్రి సారథి ఆరోపించారు. 80శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
నాణ్యత కలిగిన విద్యను అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్...
రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అంతా ఉలికిపాటుకు గురయ్యారని, భయాందోళనకు గురయ్యారని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా గత ప్రభుత్వం ఎంత బాధ్యతా రాహిత్యంగా పనిచేసిందో అర్థమవుతుందన్నారు.
భూములకు సంబంధించిన లిటిగేషన్లు తగ్గించడానికి కేంద్రం చట్టం చేసిందని, ఏపీలో చట్టాన్ని అమోదించినపుడు చెప్పిన దానికి, కేంద్రం ప్రతిపాదించిన చట్టానిక రాష్ట్రం ప్రతిపాదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని వివరించారు.
బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా చట్టాన్ని అమోదించలేదని, బీజేపీ పాలిత రాష్ట్రం అమలు చేయకపోయినా, వైసీపీ మాత్రం సన్నచిన్నకారు రైతులకు నిద్ర లేకుండా చేసిందన్నారు.రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. పాస్ పుస్తకాలు, సర్వే రాళ్ల మీద పేర్లు, బొమ్మలు వేసుకోవడం ప్రజల్లో అనుమానాలు కలిగించిందన్నారు. లిటిగేషన్లు పెంచి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఖరారు చేయకుండా, అప్పిలేట్ అథారిటీ ఎవరో కూడా చెప్పకుండా, సివిల్ కోర్టులు, జిల్లా కోర్టులకు ఎలాంటి అధికారాలు లేకుండా హైకోర్టు వెళ్లాలని సూచించడం ఏ ఉద్దేశంతో చేశారని ప్రశ్నించారు. సివిల్ కోర్టుల అధికారాలను తీసేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ…
వివిధ వర్గాల సామాజిక పెన్షన్లను పెంచుతూ ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారని దానికి అనుగుణంగా 65.03లక్షల మందికి లబ్ది కలుగనుందని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వంలో వెయ్యి రుపాయలు పెంచడానికి నాలుగేళ్లు పడితే, చంద్రబాబుకు వెయ్యి పెంచడానికి 10-15రోజులు మాత్రమే పట్టిందన్నారు. జూలై 1న సచివాలయ ఉద్యోగులే స్వయంగా ఇంటింటికి తీసుకు వెళ్లి పెన్షన్లను అందించనున్నట్టు చెప్పారు. వాలంటీర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.
దివ్యాంగులకు రూ.3వేల నుంచి 6వేలు, పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5వేల నుంచి రూ.10వేలు అందించనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ.5వేల నుంచి రూ.10వేల పెన్షన్లు అందించనున్నారు. జూలై1న రూ7వేలు చెల్లించనున్నారు. బకాయిలతో కలిపి జూలైలో రూ.7వేలు చెల్లిస్తారు.
పెంపుదల వల్ల ప్రతి నెల రూ.810కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. జూలైలో రూ.4408 కోట్లు చెల్లిస్తారు. గతంలో ఏటా 22,273కోట్ల గతంలో ఖర్చు చేస్తే ఇకపై 33,099.72 కోట్లను ఏటా ఖర్చు చేస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పున:ప్రారంభించడానికి క్యాబినెట్ నిర్ణయించింది. 123 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ప్రారంభిస్తారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పునరుద్ధరిస్తారు. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన టెండర్లను త్వరలో ఖరారు చేయనున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు…
1986లో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని 1998లో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పేరు పెట్టారని 2006లో ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా వైఎస్సార్ నిర్ణయించారని, దురదృష్టవశాత్తూ గత ప్రభుత్వం పేరు మార్చిందని, యూనివర్శిటీ పేరు మార్చడం వల్ల వైద్య విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొన్ని సంవత్సరాల మార్కుల జాబితాలపై ఒక పేరు, మరికొన్ని సంవత్సరాలు మరో పేరు పెట్టడం వల్ల ఇబ్బందులు పడ్డారని వీటిని దృష్టిలో ఉంచుకుని
పొన్నవోలు సుధాకర్, శ్రీరామ్ రాజీనామాలతో ఖాళీ అయిన ఏజీ పోస్టును దమ్మాలపాటి శ్రీనివాస్‌తో భర్తీ చేసేందుకు క్యాబినెట్ అమోద ముద్ర వేసిందని తెలిపారు ప్రకటించారు.
గంజాయి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి వర్గంతో కమిటీని ఏర్పాటు చేసినట్టు సారథి తెలిపారు. గంజాయి రవాణా, వినియోగాన్ని నిరోధించడంపై దృష్టి పెట్టేందుకు మంత్రి వర్గ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పంచాయితీలు, కార్పొరేషన్లలలో పారిశుధ్యాన్ని మెరుగు పరచడానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు.
ఏడు శ్వేత పత్రాలు…
పోలవరం, అమరావతి, విద్యుత్ - పర్యావరణం, ల్యాండ్- శాండ్, లా అండ్ ఆర్డర్, ఫైనాన్స్, లిక్కర్ లపై 30వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్వేత పత్రాలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది,.