AP Free Gas Cylinder Scheme : ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పథకం అమలుపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
AP Free Gas Cylinder Scheme : ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.
AP Free Gas Cylinder Scheme : సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు...హామీలు అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రులు అసెంబ్లీ తెలిపారు. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుతో ఏటా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనేది అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వం నేరుగా గ్యాస్ కంపెనీలకే సిలిండర్ డబ్బులు జమ చేయాలా? లేక లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.
ఏటా 3 గ్యాస్ సిలిండర్లు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. 2016 నుంచి 2024 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా గ్యాస్ తీసుకున్న వారికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇచ్చారని చెప్పారు. ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో మహిళలకు ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. ఈ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పై వివిధ శాఖలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇంకా రూ.674 కోట్ల ధాన్యం బకాయిలు
రబీ పంటకు సంబంధించి రైతులకు ఇంకా ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా, వారిని మోసం చేసి వెళ్లిపోతే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రూ.1000 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లించి రైతులకు అండగా నిలిచామన్నారు. త్వరలోనే రూ.674 కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు చెల్లిస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. రైతులకు కార్పొరేషన్ ద్వారా టార్పాలిన్ లను ఉచితంగా అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతుకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.
రైతులందరికీ పంట బీమా
ఏపీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రులు, అధికారులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీలో వ్యవసాయంపై ప్రకృతి విపత్తుల ప్రభావంపై సభ్యులు చర్చించారు. పంటల బీమా అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలంచే సరైన పంటల బీమా విధానం అమల్లో ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించింది. గత ప్రభుత్వంలో మామిడి రైతులకు పంట బీమా పథకం అమలు చేయలేదని, ఈసారి మామిడి రైతులకు కూడా బీమా వర్తింపజేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
సంబంధిత కథనం