Janasena Glass Symbol : జనసేనకే గాజు గ్లాస్ గుర్తు, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
Janasena Glass Symbol : గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
Janasena Glass Symbol : కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్" ను కన్ఫార్మ్ చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" ను మరోసారి కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. గాజు గ్లాస్ గుర్తును మరోసారి కేటాయించడంపై ఎన్నికల సంఘానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కల్యాణ్ హర్షం
తెలుగు రాష్ట్రాల్లో గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేశారు. ఏపీలోని 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేసేందుకు జనసేన పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని పవన్ తెలిపారు. ఈ తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరు పేరునా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గతంలో జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ లిస్ట్ లో పెట్టిన విషయం తెలిసింది. జనసేనకు ఇకపై గాజు గ్లాస్ గుర్తు ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో ఫ్రీ సింబల్ జాబితాలో
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును కేంద్రం ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో జనసేన కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందారు. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు సింబల్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు వస్తుందో? లేదో? అని ఆందోళన చెందారు. వైసీపీ విముక్త ఏపీ అంటూ టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ కు గ్లాస్ సింబల్ కీలకంగా మారింది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ రాస్తామని అప్పట్లో జనసేన తెలిపింది. జనసేన అభ్యర్థన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా గాజు గ్లాస్ సింబల్ ను జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపనుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బరిలోకి దిగుతున్న జనసేన...అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.