CM Chandrababu Letter : సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జులై 6 భేటీకి ప్రతిపాదన
CM Chandrababu Letter to Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి... ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కరం, పరస్పర సహకారం కోసం కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. జులై 6న సమావేశం అవుదామని కోరారు.
CM Chandrababu Letter to Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు, ఇతర విషయాలపై చర్చించేందుకు భేటీ అవుదామని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల పురోగతి, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తుంటానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
"తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన విశేషమైన కార్యక్రమాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి కోసం సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి, పరస్పర లక్ష్యాలను సాధించడంలో పరస్పర సహకారం కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ సమస్యల పరిష్కారం మన రాష్ట్రాల సంక్షేమం, పురోగతిపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయి. ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో జులై 6వ తేదీ శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతంలో కలుసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ సమావేశం క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి సహాయపడుతుందని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను సాధించడంలో సమర్థవంతంగా సహకరించడానికి మాకు అవకాశాన్ని కల్పిస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ చర్చలు ఫలితాలు ఇస్తాయని నాకు నమ్మకం ఉంది" అని సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
పదేళ్లు గడుస్తున్నా సమస్యల పరిష్కారమేదీ?
ఏపీ, తెలంగాణ విడిపోయి ఈ ఏడాది జూన్ 2కి పదేళ్లు గడిచిపోయాయి. అయినా విభజన సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు, నీటి కేటాయింపులపై వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై చర్చించినా పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పటికైనా విభజన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయా? అని విశ్లేషకులు భావిస్తున్నారు.
విభజన సమస్యలు పరిష్కారం, పురపాలక శాఖలో ఆస్తుల పంపకాలపై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ బోర్డు, సంబంధిత అధికారులతో ఇటీవల మంత్రి నారాయణ చర్చించారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు పూర్తి కావడంతోపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసిందని సమీక్షలో మంత్రి నారాయణ గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన మాత్రం ఇంకా పూర్తి కాలేదన్నారు. ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుందన్నారు. తొమ్మిది, పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా కొలిక్కి రావడం లేదన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకునేందుకు, పంపకాల విషయంలో ఏ రాష్ట్రానికే చెందినవి ఆ రాష్ట్రానికే చెందేలా కొత్త అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందన్నారు. కొన్ని సంస్థలు పంచాయతీ రాజ్ శాఖకు చెందినవి కూడా ఉన్నాయన్నారు. అలాంటి సంస్థల ఆస్తులపై వివరాల సేకరిస్తున్నామని మంత్రి నారాయణ ఆరా తీశారు.