AP Pension Distribution : స్వయంగా పింఛన్ అందిచనున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు-amaravati cm chandrababu distributes pensions on july 1st penumaka cs key orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pension Distribution : స్వయంగా పింఛన్ అందిచనున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

AP Pension Distribution : స్వయంగా పింఛన్ అందిచనున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 29, 2024 07:11 PM IST

AP Pension Distribution : ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరభ్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తొలిరోజే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇవాళ రాత్రికే నగదు విత్ డ్రా చేయాలి కలెక్టర్లకు సూచించారు. సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

స్వయంగా పింఛన్ అందిచనున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు
స్వయంగా పింఛన్ అందిచనున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

AP Pension Distribution : ఏపీలో పెంచిన పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్ల పంపిణీ కేటాయించిన నగదును శనివారం రాత్రిలోగా బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. బ్యాంకులు ఇవాళ రాత్రి నగదు ఇవ్వకపోతే రేపు అందించాలని స్పష్టంచేశారు. జులై 1వ తేదీన ఉదయం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు. తొలిరోజే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని సీఎస్ ఆదేశించారు.

జులై 1న పెంచిన పెన్షన్లు పంపిణీ

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పెన్షన్ పంపిణీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను పెంచారు. గత ప్రభుత్వం రూ.3,000 పెన్షన్ ఇస్తే దాన్ని రూ.4,000కి పెంచింది. అలాగే గత మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా రూ.1,000 చొప్పున, జులైలో నెల రూ.4,000, గత మూడు నెలల రూ.3,000 మొత్తం రూ.7,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచారు. వికలాంగులకు, మల్టీడిఫార్మిటీ లెప్రసీలకు పెన్షన్ రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచారు.‌ పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు పెన్షన్ రూ.5,000 నుంచి రూ.15,000కు పెంచారు.‌ కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు.

స్వయంగా పెన్షన్ అందించనున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు జులై 1న స్వయంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి తన చేతులతో పేదింటి మహిళకు పింఛన్ అందజేయనున్నారు. సీఎం పెన్షన్ పంపిణీ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను జులై 1న పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయనుండడంతో అధికారుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెనుమాకపై పెన్షన్ల లబ్దిదారులను గుర్తిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి ఉద్యోగి 50 పింఛన్లు పంచేలా సర్దుబాటు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. పెన్షన్లదారులు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఎల్లుండి నుంచి పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన రూ.1000తో కలిపి పింఛన్లు అందజేస్తామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ఒకేసారి రూ.1000 పెంచి పెన్షన్లను అందజేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు చెప్పారు. పెన్షన్ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ప్రతినెలా అదనంగా రూ.819 కోట్ల భారం ఉండనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి వృద్ధులను ఎన్నో కష్టాలు పెట్టిందని, వారి కష్టాలను చూసి చలించిపోయానని సీఎం చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం