CM Chandrababu : ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చ-amaravati cm chandrababu meets youtube representatives discussed youtube academy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చ

CM Chandrababu : ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చ

Bandaru Satyaprasad HT Telugu
Aug 06, 2024 06:12 PM IST

CM Chandrababu : ఏపీకి దిగ్గజ టెక్ కంపెనీలు తీసుకొచ్చేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం యూట్యూబ్, గూగుల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చ
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చ

CM Chandrababu : ఏపీకి ప్రతిష్టాత్మక సంస్థలు, పెట్టుబడులు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు యూట్యూబ్, గూగుల్ ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశం అయ్యారు. మంగళవారం యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాలతో సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో మాట్లాడారు. ఏపీలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించినట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ లో తెలిపారు.

యూట్యూబ్, గూగుల్ ప్రతినిధులతో ఆన్‌లైన్‌ వేదికగా సమావేశం కావడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏఐ, స్కిల్ డెవలప్మెంట్, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్లు పేర్కొ్న్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాల పై వారితో చర్చించినట్లు తెలిపారు.

విద్యా వాలంటీర్లపై సీఎం కీలక ఆదేశాలు

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం...సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యార్థుల చదువుల నాణ్యత దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా టీచర్ల కొరత ఉంటే అక్కడ విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా విజ్ఞాన, విహారయాత్రలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో క్రీడలకు పెద్ద పీట వేయాలన్నారు.

సీఎం చంద్రబాబును కలిసి గోనె ప్రకాష్ రావు

సీఎం చంద్రబాబును ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు మంచి చేస్తు్న్నారన్నారు. గత ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో ఏపీ, తెలంగాణలో రావణాసురుడు, శిశుపాలుడి పాలన కొనసాగిందని విమర్శించారు. సీబీఐ కోర్టుకు జగన్ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబు...తిరిగి జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేపడితే విదేశీ విరాళాలు ఇప్పించేందుకు తాను కృషి చేస్తానన్నారు. ఏపీలో 36 మందిని హత్య చేశారని చెబుతున్న జగన్ ఆ వివరాలు బయటపెట్టాలని గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. దేశంలో ఏ సీఎం...జగన్‌లా పరదాలు కట్టుకుని తిరగలేదన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్న... జగన్‌కు సిగ్గుందా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రాష్ట్రపతి పాలన ఎలా పెడతారని గోనె ప్రకాష్‌రావు ప్రశ్నించారు.