Google new features : గూగుల్ కొత్త ఫీచర్స్- ఇక మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత 'స్మార్ట్'!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ కొత్తగా ఈ 6 ఫీచర్స్‌ని లాంచ్ చేసింది. ఆ వివరాలు..
కోట్లాది మంది వద్ద ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా పాతవి, నెమ్మదిగా ఉంటాయి. వాటి యజమానులు వాటిని స్మార్ట్‌గా మార్చే కొన్ని గూగుల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ని కోరుకుంటారు. అలాంటి వారిలో మీరూ ఉన్నారా? అయితే మీ కోసం ఇక్కడ ఒక శుభవార్త ఉంది. 300 కోట్ల యాక్టివ్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను విడుదల చేసింది. యూజర్లను సురక్షితంగా ఉంచడానికి, వారు మరింత మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడే ఆరు కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ విడుదల చేసింది. వాటిని ఓసారి చూద్దాము..
గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ..
ఈ గూగుల్ ఫీచర్లలో మొదటిది ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ. ఈ ఫీచర్ వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు భూకంపం రావడానికి సెకన్ల ముందు హెచ్చరికలు అందుతాయి. గూగుల్ ఇటీవల న్యూజిలాండ్, గ్రీస్ దేశాల్లో ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రవేశపెట్టింది. టర్కీ, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్లలో ఈ ఫీచర్‌ని లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాదిలో మరిన్ని దేశాల్లో ఈ ఫీచర్ ను లాంచ్ చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.
స్టార్ - మెసేజెస్ యాప్..
రెండో గూగుల్ ఆండ్రాయిడ్ ఫీచర్‌ను మెసేజెస్ యాప్ లో 'స్టార్' అని పిలుస్తారు. ఇప్పుడు యూజర్లు తమ మెసేజెస్ యాప్‌లో ఒక సందేశాన్ని స్టార్ చేసి ముఖ్యమైన వాటిని ట్రాక్ చేయవచ్చని గూగుల్ తెలిపింది. యూజర్లు తాము స్టార్ చేయాలనుకుంటున్న సందేశాన్ని ట్యాప్ చేసి పట్టుకోవడం ద్వారా సందేశాన్ని స్టార్ చేయవచ్చు. రాబోయే వారాల్లో స్టార్ సందేశాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది.
సందర్భోచిత ఎమోజీ కిచెన్ స్టిక్కర్లు..
మూడొవ ఫీచర్.. సందర్భోచిత ఎమోజీ కిచెన్ స్టిక్కర్లు. త్వరలో వినియోగదారులు సందేశాన్ని టైప్ చేసిన తర్వాత ఎమోజీ కిచెన్‌లో సందర్భోచిత సూచనలను చూడటం ప్రారంభిస్తారని గూగుల్ తెలిపింది. వినియోగదారులు తమకు అవసరమైన ఖచ్చితమైన సమయంలో సరైన ఎమోజీ కలయికను కనుగొనడానికి ఇది సహాయపడుతుందని గూగుల్ తెలిపింది. సందర్భోచిత ఎమోజీ కిచెన్ సూచనలు ప్రస్తుతం జీబోర్డ్ బీటాలో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0, అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న పరికరాలలో ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో రాసిన సందేశాల కోసం అవి జిబోర్డ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయి.
గూగుల్ అసిస్టెంట్: వాయిస్ కమాండ్స్..
ఈ ఫీచర్లతో పాటు, గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు వాయిస్ కమాండ్లను ఉపయోగించి మరిన్ని యాప్స్‌ని వినియోగదారులకు ఎనేబుల్ చేస్తుంది. "కేవలం మీ వాయిస్ ఉపయోగించి మీకు ఇష్టమైన అనేక యాప్స్‌ని ఓపెన్ లేదా సెర్చ్ చేయవచ్చు. మీరు యాప్లోకి వెళ్లి పనిని పూర్తి చేయడానికి "హే గూగుల్, నా క్యాపిటల్ వన్ బిల్లు చెల్లించు" లేదా లాక్ స్క్రీన్‌పై మీ వారపు పురోగతిని త్వరగా చూడటానికి "హే గూగుల్, చెక్ మై మైల్స్ ఆన్ స్ట్రావా" వంటి విషయాలను చెప్పవచ్చు అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
గూగుల్ వాయిస్ యాక్సెస్, గాజ్ డిటెక్షన్..
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో వాయిస్ యాక్సెస్‌పై మెరుగైన పాస్వర్డ్ ఇన్పుట్, గాజ్ డిటెక్షన్‌ను కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకువస్తోంది. "గాజ్ డిటెక్షన్‌తో, ఇప్పుడు బీటాలో, మీరు స్క్రీన్‌ని చూస్తున్నప్పుడు మాత్రమే పనిచేయడానికి వాయిస్ యాక్సెస్‌ని అడగవచ్చు - కాబట్టి మీరు సహజంగా స్నేహితులతో మాట్లాడటం, మీ ఫోన్‌ని ఉపయోగించడం మధ్య మూవ్ అవ్వొచ్చు," అని గూగుల్ తెలిపింది. వాయిస్ యాక్సెస్ ఇప్పుడు మెరుగైన పాస్వర్డ్ ఇన్‌పుట్స్‌ని కలిగి ఉందని గూగుల్ తెలిపింది. ఇది పాస్వర్డ్ ఫీల్డ్‌ని గుర్తించినప్పుడు, వినియోగదారులకు అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలను ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది.
ఆండ్రాయిడ్ ఆటో..
చివరీగా, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటోలో కొత్త యాప్ అనుభవాలను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఆటో అనుభవాన్ని మరింత మెరుగ్గా కస్టమైజ్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ అప్డేట్తో యూజర్లు తమ మీడియా యాప్స్‌లో కొత్త ట్యాబ్లు, బ్యాక్ టు టాప్ ఆప్షన్, స్క్రోల్ బార్లో ఏ టు జెడ్ బటన్‌తో కంటెంట్‌ని బ్రౌజ్ చేయవచ్చు. "మీ డ్రైవ్‌ని మెరుగుపరచడంలో సహాయపడటానికి మేము కొత్త యాప్ అనుభవాలను కూడా జోడించాము. ఈవీ ఛార్జింగ్, పార్కింగ్, నావిగేషన్ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటోలో ఉపయోగించడానికి అందుబాటులో ఉన్నాయి. ప్లస్, మేము మెసేజింగ్ అనుభవాన్ని మెరుగుపరిచాము. తద్వారా మీరు లాంచర్ స్క్రీన్ నుంచి మీకు ఇష్టమైన మెసేజింగ్ యాప్స్‌ని యాక్సెస్ చేయవచ్చు," అని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ 6.0 ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం