Employees Child Care Leaves : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, చైల్డ్ కేర్ లీవ్ వయోపరిమితి తొలగింపు
Employees Child Care Leaves : ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. చైల్డ్ కేర్ సెలవులను సర్వీస్ కాలంలో ఎప్పుడైనా తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి నిబంధనను తొలగించింది.
Employees Child Care Leaves : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్ కు సంబంధించిన వయో పరిమితులను తొలగించింది. రిటర్మెంట్ వరకు గరిష్టంగా 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ పొందవచ్చు. మహిళా ఉద్యోగులు, అలాగే ఒంటరి పురుషులు(భార్య చనిపోయిన/ విడాకులు తీసుకొన్న) వాళ్లు చైల్డ్ కేర్ సెలవులకు అర్హులు. రిటైర్మెంట్ వరకు 180 రోజుల సెలవు 10 దఫాలుగా ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
2016లో ఇచ్చిన జీవో నెం.132 ప్రకారం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 60 రోజుల పాటు చైల్డ్ కేర్ సెలవులు ఇచ్చింది. మైనర్ చైల్డ్ ను చూసుకునేందుకు, స్కూల్, కాలేజీ పరీక్షలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రెండు నెలల పాటు ఉద్యోగులు ఈ సెలవులు తీసుకోవచ్చు. అయితే ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు లేదా దివ్యాంగులైతే 22 ఏళ్ల వరకు ఉద్యోగులకు మూడు దఫాలుగా 60 రోజులు...చైల్డ్ కేర్ సెలవులు ఇచ్చేవారు. అయితే 2022లో ఇచ్చిన జీవో నెం.32 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచారు. మహిళా ఉద్యోగుల తమ సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులు తీసుకోవచ్చు. అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పురుష ఉద్యోగులకు(భార్య లేని వారు) ఈ సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే 180 రోజుల సెలవులను 10 దఫాలుగా తీసుకోవచ్చని తెలిపింది. తాజాగా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు మహిళా ఉద్యోగులకు వయో పరిమితి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు
ఏపీ సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 16 శాతంగా హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అయితే హెచ్ఆర్ఏ మొత్తం రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఆర్ఏ పెంపుపై సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ ఇంకా అమల్లోకి రానందున, వచ్చే ఏడాది జూన్ వరకు పెంచిన హెచ్‌ఆర్‌ఏ అమలులో ఉంటుందని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 12వ పీఆర్సీని నియమించాలని కోరుతున్నారు.
మెడికల్ రీయంబర్స్మెంట్ మరో ఏడాది పొడిగింపు
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 పొడిగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు సమాంతరంగా మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.