CM Chandrababu : సర్వే రాళ్లపై జగన్ ఫొటో కోసం రూ.640 కోట్ల ఖర్చు, ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడీ - సీఎం చంద్రబాబు
CM Chandrababu : సర్వే రాళ్ల పైన జగన్ ఫొటో కోసం రూ.640 కోట్లు ఖర్చు చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయన్నారు.
CM Chandrababu : గత వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేత పత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటి పైనా దోపిడీ, విధ్వంసం జరిగిందన్నారు. రికార్డుల్లో అన్ని దొరకలేదని, క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయన్నారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో జరిగిన భూ దోపిడీలు ఒక ఉదాహరణ మాత్రమే అని, ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ చేశారని ఆరోపించారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారని చంద్రబాబు మండిపడ్డారు. అనర్హులైన వారికి భూకేటాయింపులు చేశారన్నారు.
వైసీపీ నేతల భూదందా
"విశాఖ లో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏమిటి? అప్పటి వైసీపీ ఎంపీ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమి కొట్టేశారు. శారదా పీఠానికి కోట్ల విలువ చేసే భూమి ఎకరా లక్షకు కేటాయించారు. మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన కంపెనీలకు కోట్ల రూపాయలు భూములు ఇచ్చేశారు. ఒంగోలులో 101 కోట్ల రూపాయల ఆస్తిని నకిలీ డాక్యుమెంట్ లతో కాజేశారు. తిరుపతిలో మఠం భూములను 22ఏలో పెట్టి వైసీపీ వాళ్లు కొట్టేశారు. 70 ఎకరాల భూమిని 22ఏలో చేర్చి వైసీపీ నేతలు కాజేశారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా వైసీపీ నాయకులు దోచేశారు. పుంగనూరులో ఓ బడా నేత ఆధీనంలో రైత్వారీ పట్టాల ద్వారా భూములు కాజేశారు. ఇళ్ల పట్టాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయి. ఎస్సీ ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారు. అవ భూములు, అటవీ భూములను ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారు. ఇవి నివాస యోగ్యం కానివి" - సీఎం చంద్రబాబు
జగన్ ఫొటో కోసం రూ.640 కోట్లు
సర్వే రాళ్ల పైన జగన్ ఫొటో కోసం రూ.640 కోట్లు ఖర్చు చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకరమైన చట్టం తెచ్చారని, మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే ఆచట్టాన్ని రద్దు చేశామన్నారు. భూములని కొట్టేయటానికి జగన్ ముఠా ఒక వినూత్నమైన పంథా ఎంచుకుందన్నారు. భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకోవచ్చని, ఎంతో అహంభావంతో ఈ చట్టం తెచ్చారన్నారు. భవిష్యత్‌లో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్‌లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఏపీలో కూడా అమలు చేస్తామన్నారు. తాము భూమి యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలన్నారు.
వైసీపీ నేతలకు కప్పం కట్టలేక ఆత్మహత్యలు
మైనింగ్, క్వారీ లీజుల్లో వైసీపీ నేతలు అనేక దోపిడీలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు. బెదిరింపులు, భారీ జరిమానాలతో గనులు కొల్లగొట్టారన్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు పొడిచి గనులు తవ్వేశారన్నారు. అధికారులను డిప్యుటేషన్‌పై తెచ్చుకుని వారి అండతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చారన్నారు. అక్రమంగా భారీ యంత్రాలుతో తవ్వకాలు జరిపారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయన్నారు. వైసీపీ నేతలకు కప్పం కట్టలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇసుక స్కామ్ లో రూ.9,750 కోట్లు కాజేశారని సీఎం చంద్రబాబు తెలిపారు.
సంబంధిత కథనం