Pawan Kalyan: వైసీపీ నాయకులు ప్రత్యర్థులు మాత్రమే.. మహిళల్ని కించపరిస్తే వేటు పడుతుందని పవన్ వార్నింగ్
Pawan Kalyan: అధికారంలోకి వచ్చామనే అహంకారంతో జనసేన నాయకులు అహంకారంతో ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వేటు తప్పదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిపై తక్షణమే చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Pawan Kalyan: ఏపీలో వైసీపీ నేతలు శత్రువుల కాదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని ఎవరు వాళ్లను ద్వేషించొద్దు, వాళ్లు చేసిన తప్పులు చేయొద్దు, నిజంగా వారితో గొడవ పడాల్సి వచ్చినపుడు మాత్రమే తీవ్రత చూపిద్దాం... పరుష పదజాలం వాడాల్సిన అవసరం కూడా లేదు, అవసరమైతే పదవులు పక్కన పెట్టి పోరాడేందుకు కూడా సిద్ధమేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్ని పవన్ సన్మానించారు.
తన శాఖలో సమీక్షిస్తుంటే పంచాయితీ రాజ్‌లో కనీసం రూ.200కోట్లు కూడా ఖర్చు చేసే పరిస్థితులు లేవు, రూ.40కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులు కూడా ఉన్నాయని ఆ డబ్బు కూడా ప్రభుత్వం వద్ద లేదని పవన్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టాలనే విజ్ఞత లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రజల సొమ్మును అకారణంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అధికారులకు చెప్పానని, రోడ్లు, వీధుల్లో కూర్చుని పనిచేశామని, దానికి హంగు అర్భాటాలు అవసరం లేదని, కొత్తగా ఎలాంటి ఫర్నిచర్ అవసరం లేదని అధికారులకు చెప్పానన్నారు. ఎన్నికైన ప్రతి ఒక్కరు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గెలిచాం కాబట్టి అధికారుల్ని ఇబ్బంది పెట్టొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు.
కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు..
ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లొద్దని పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. వారసత్వానికి తాను వ్యతిరేకం కాకున్నా ప్రజలపై బలంగా రుద్దొద్దని హెచ్చరించారు. నేతలు ఎవరు రౌడీయిజం, రుబాబు ఎవరు చేయొద్దని, వైసీపీవంటి పార్టీని ఎదుర్కొని తాను రాజకీయాలు నడిపానని, సోషల్ మీడియాలో పార్టీ నాయకుల్ని తిట్టే వారిని వదులుకోడానికి తాను సిద్ధమన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వారిని తాను వదిలేస్తానని చెప్పారు. వారు తనకు ఎంత సన్నిహితులైనా వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.
మహిళల్ని సామాజిక మాధ్యమల్లో కించపరిచినా, దూషించినా వదిలేది లేదన్నారు. పార్టీకి చెందిన వారు ఎవరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదన్నారు, తాము లేకపోతే పార్టీ ఏమైపోతుంది అని ఎవరు అనుకోవద్దని, విర్రవీగిన వాళ్లను ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారని, భయపెట్టేవారు, రౌడీయిజం చేసే వారిని జనం ఉపేక్షించరన్నారు. తెగించి పార్టీ నడుపుతున్నానని, 24గంటలకు బతకడానికి మాత్రమే తాను ఆలోచిస్తానని, భవిష్యత్ గురించి ఆందోళన లేదన్నారు.
జనసేన ఎన్డీఏకు కూడా ఊతం ఇచ్చిందని, దేశం కోసం, సమాజం కోసం కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏ స్వార్థం లేకుండా పనిచేసే జనసైనికులు చాలామంది ఉన్నారన్నారు. అంబానీ ఇంట్లో పెళ్లిలో సనాతన ధర్మాన్ని నిలబెట్టారని చెబుతుంటే తనపై ఎంత బాధ్యత ఉందో తెలిసిందన్నారు.
అవసరమైతే సొంత రక్తాన్ని, కుటుంబాన్ని కూడా రాజకీయాల్లో పక్కన పెట్టే ధైర్యం తనకుందని, ప్రజా క్షేత్రంలో నిలబడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పారు. 21మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వచ్చారని, ఫలితాలు ఎలా ఉన్నా అలాగే నిలబడి ఉండేవాడినన్నారు. నాయకులంతా కుటుంబ సభ్యుల్ని భవిష్యత్ వారసులుగా ప్రచారం చేయొద్దన్నారు. కొత్త తరం ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు. నాయకుల ఎదుగుదల సహజ క్రమంలో జరగాలని, ఎవరికి వారు ఆత్మ విమర్శలు చేసుకోవాలన్నారు. దీనిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
ఎన్నికల్లో సాధించిన విజయం కూటమి సాధించిన విజయమని, టీడీపీ, బీజేపీ నాయకుల్ని తక్కువ చేయడం, తూలనాడటం చేస్తే, అలాంటివి చేస్తే దానిని పార్టీకి అపాదిస్తారని పొరపాటున కూడా ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం, కించపరచడం చేయొద్దన్నారు. చాలా ముఖ్యమైన పనులు రాష్ట్రానికి ఉన్నాయని, పంచాయితీలకు ఖర్చు చేయడానికి రూ.200కోట్లు లేవన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రభుత్వం భరోసా ఇస్తే డబ్బులివ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని,పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి తనతో సహా అందరు అండగా నిలవాల్సి ఉందన్నారు.
పదవుల కోసం ఒత్తిడి చేయొద్దు…
పదవులు, ఛైర్మన్ల కోసం తనపై ఎవరు ఒత్తిడి చేయొద్దని, టీటీడీ లాంటి పదవి కావాలని కూడా అడుగుతున్నారని అలాంటి డిమాండ్లు చేయొద్దని పవన్ స్పష్టం చేశారు. పార్టీ నాయకులు తన గుండెల్లో ఉంటారని, పార్టీ పరిమితులు, కూటమి ప్రయోజనాల దృష్ట్యా నాయకులు తనకు సహకరించాలన్నారు. టీటీడీ ఛైర్మన్ కావాలని 50మంది అడిగారని, తమ ఇంట్లో వాళ్లు ఎవరు అడకపోవడమే అదే తనకు సంతోషం కలిగించిందన్నారు. నాగబాబు పేరు ప్రచారం జరిగిందని, అందుకే వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. నాగబాబు నిరాకరాన్ని పూజించే రకమన్నారు. ఆయన పేరు ఎందుకు వచ్చిందో తనకు తెలియదన్నారు.
నాదెండ్ల మనోహర్ రాష్ట్రం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అక్రమ గోడౌన్లపై దాడులు చేయడంలో నాదెండ్ల బిజీగా ఉన్నందున పార్టీకి సంబంధించిన విషయాలను హరిప్రసాద్, నాగబాబు దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ సూచించారు. నెలకోసారి, మూడు వారాలకోసారైనా వారితో సమావేశం అవుతానన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజాప్రతినిధులంతా నిక్కచ్చిగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అందులో రాజీపడొద్దన్నారు.