APSRTC Special Buses: దసరా సెలవుల్లో విజయవాడకు వెయ్యి ప్రత్యేక బస్సులు
APSRTC Special Buses: దసరా పండుగ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సుల్ని నడుపనున్నారు.
APSRTC Special Buses: దసరా పండుగ ప్రయాణాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్ని విజయవాడకు నడుపుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు రోజువారీగా తిరుగుతున్న 355 బస్సులకు ఇవి అదనంగా తిరుగుతాయి. ఈనెల 18 నుంచి 23 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
దసరా ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 13వ తేదీ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని అదనపు ఛార్జీ లేకుండానే నడుపుతోంది.
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 26వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతున్నారు.
హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, భద్రాచలం, రాయలసీమ ప్రాంతాలకు వెయ్యి బస్సుల్ని ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 13న రాజమండ్రి నుంచి 6, విశాఖపట్నం నుంచి 10, బెంగుళూరు నుంచి ఒకటి, చెన్నై నుంచి 3, ఇతర ప్రాంతాల నుంచి 18 ప్రత్యేక సర్వీసుల్ని విజయవాడకు నడుపుతారు. అక్టోబర్ 18 నుంచి బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు ప్రకటించారు.
ప్రత్యేక బస్సుల్ని నియంత్రించేందుకు విజయవాడ బస్ టెర్మినల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు రెండు వైపులా ప్రయాణాలకు ఒకేసారి టిక్కెట్ కొనుగోలు చేస్తే 10శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఈ వాలెట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేస్తే 5శాతం రాయితీ లభిస్తుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే మరో 5శాతం రాయితీ లభిస్తుంది. 60ఏళ్లు పైబడిన వారికి అన్ని రకాల ఏసీ, నాన్ ఏసీ సర్వీసుల్లో 25శాతం రాయితీ కల్పిస్తున్నారు. డిజిటల్ ఆధార్ కార్డులను ప్రయాణంలో చూపాల్సి ఉంటుంది.
దసరా ప్రయాణాలకు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో apsrtconline.inలో లేదా బస్ స్టేషన్, ఆర్టీసీ ఏజెంట్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. విజయవాడ పిఎన్‌బిస్ టెర్మినల్‌లో 9515125823, ఏటిఎం 9959225454, మేనేజర్ 9959225467 నంబర్లలో ప్రయాణికులు సంప్రదించవచ్చు.
హైదరాబాద్ నుంచి అదనపు సర్వీసులు…
హైదరాబాద్‌లో స్థిరపడిన వారు పండుగ సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లనుండటంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడపా లని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్‌ఈఎల్, మియాపూర్, ఈసీఐఎల్, ఎంజీబీఎస్‌ల నుంచి ఇవి బయలుదేరతాయి.
ఎంజీబీఎస్ లో రద్దీని నివారించేందుకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచెర్ల తదితర ప్రాంతాలకు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్ ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ ప్రాంగణం నుంచి నడుపుతారని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.