Vijayawada : నీళ్లనుకుని యాసిడ్ తాగిన ఏడాదన్న చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి
Vijayawada : విజయవాడలో విషాదం జరిగింది. నీళ్లనుకుని యాసిడ్ తాగిన ఏడాదన్న చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలోని అశోక్‌నగర్‌లో విషాదం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందని మహ్మద్ అబ్బాస్.. క్రేన్ హెల్పర్‌గా పని చేస్తున్నారు. అతనికి విజయవాడ అశోక్ నగర్‌కు చెందిన మహిళతో నాలుగేళ్ల కిందట వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా (18 నెలలు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 19న అబ్బాస్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మచీలిపట్నం నుంచి అశోక్ నగర్‌లోని అత్తారింటికి వచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆఫియా ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లింది. అక్కడ స్నానాల గది శుభ్రం చేసే యాసిడ్ సీసా మూత తీసి.. నీళ్లనుకుని తాగింది. దీంతో కడుపులో వికారంగా ఉండటంతో వాంతులు చేసుకుంది. గమనించిన అబ్బాస్.. వెంటనే పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆఫియా చికిత్స పొందుతూ ఈ నెల 21న మరణించింది. ఈ ఘటన గురించి పోలీసులకు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరద నీటితో బ్యాక్టీరియాతో..
జగ్గయ్యపేటలో ఇటీవలి వచ్చిన వరదల నీటి బ్యాక్టీరియాతో ఓ బాలుడు కాలు కోల్పోయాడు. చలాకిగా ఉండే బాలుడు కాలును కోల్పోవాల్సి రావడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్న గాయం కారణంగా నీళ్లలోని బ్యాక్టీరియా సోకడంతో చివరికి కాలు కోల్పోవడం, మరో కాలికి కూడా ఆ ప్రమాదం పొంచి ఉండడంతో కుటుంబం కన్నీరు మున్నీరు అవుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో కొత్త నాగరాజు కుటుంబం నివాసం ఉంటుంది. కొత్త నాగరాజు ప్రైవేటు కంపెనీలో, భార్య ప్రైవేటు స్కూల్లో పని చేస్తున్నారు. వారి కుమారుడు భవదీప్ ఏడో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు నృత్యంలోనూ అదరగొట్టేవాడు. అన్నింటా చలాకీగా ఉండేవాడు. సెప్టెంబర్ 1న వరదలతో వేపల వాగు పొంగి పక్కనే ఉన్న ఆర్టీసీ కాలనీని ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరి రెండు రోజులు పాటు ఆ ప్రాంత వాసులు నానాల్సి వచ్చింది.
భవదీప్‌కు అప్పటికే కాలికి చిన్న గాయమై చర్మం చీలి ఉండటంతో.. సెప్టెంబర్ 4న జ్వరం వచ్చింది. తరువాత కాలు వాపు రావడంతో వైరల్ జ్వరాల తరహాలో అనుకొని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు పిల్లల ఆసుపత్రికి వెళ్లగా.. వారు విజయవాడ వెళ్లాలని సూచించారు. దీంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది అరుదైన బ్యాక్టీరియా అని గుర్తించి.. హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో విజయవాడంలోనే ఒక ఆసుపత్రిలో వైద్యానికి చేర్చారు.
తీరా కాలికి ఇన్ఫెక్షన్ పెరిగి అది పైకి విస్తరించింది. కాలు తొడ వరకూ తీసేయాల్సి వచ్చింది. ఈ లోగా రెండో కాలికి కూడా బ్యాక్టీరియా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ కాలికి వైద్యం చేస్తున్నారు. రెండో కాలుకు కూడా అదే లక్షణాలు కనబడటంతో.. ఎక్కడ ఇన్‌ఫెక్షన్ విస్తరిస్తుందోనని తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఇప్పటి వరకూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సాయంతో వైద్యం చేయించామని.. ఇప్పుడిక ప్రభుత్వం చేయూత ఇవ్వకపోతే వైద్యం చేయించలేమని నాగరాజు కన్నీటి పర్యంతమవుతున్నారు. జగ్గయ్యపేట పారామౌంట్ ఇంటస్ట్రీస్ అధినేత వెనిగళ్ల సురేష్ రూ.లక్ష సాయం ప్రకటించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)