AP jawan died : కడప జిల్లాలో విషాదం.. మావోయిస్టుల మందుపాతరకు జవాన్ బలి-a jawan from kadapa district was killed in an ied blast in the forests of chhattisgarh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Jawan Died : కడప జిల్లాలో విషాదం.. మావోయిస్టుల మందుపాతరకు జవాన్ బలి

AP jawan died : కడప జిల్లాలో విషాదం.. మావోయిస్టుల మందుపాతరకు జవాన్ బలి

Basani Shiva Kumar HT Telugu
Oct 20, 2024 10:45 AM IST

AP jawan died : మావోయిస్టుల మందుపాతరకు ఏపీకి చెందిన జవాన్ బలయ్యాడు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి.. బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌గా చనిపోయాడు. దీంతో పాపిరెడ్డిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మావోయిస్టులు అమర్చిన మందుపాతర
మావోయిస్టులు అమర్చిన మందుపాతర (HT Telugu)

ఛత్తీస్‌గఢ్‌‌లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌ ప్రాంతంలో విషాదం జరిగింది. అమ కొడ్లియార్‌ గ్రామ సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చా, మొహండీ, ఇరాక్‌ భట్టీ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు శుక్రవారం కూంబింగ్‌ నిర్వహించాయి.

అర్ధరాత్రి సమయంలో బలగాలు బేస్‌ క్యాంప్ వైపు వస్తుండగా.. ఐఈడీ బాంబులపై జవాన్లు కాలు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. కడప జిల్లాకు చెందిన కె.రాజేశ్‌(37), మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఐటీబీపీ 53వ బెటాలియన్‌ జవాన్‌ అమర్‌ పన్వర్‌(36) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

రాజేశ్ గ్రామంలో విషాదం..

మృతిచెందిన రాజేశ్‌ది కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెగా గుర్తించారు. రాజేశ్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. రాజేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జవాన్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

బీరు సీసాలో మందుపాతర..

ఇటీవల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లాన్ వేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా బీరు సీసాలో మందుపాతలను అమర్చారు. మూడుచోట్ల అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించాయి. బీరు సీసాల్లో ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) లను అమర్చారు. సీఆర్పీఎఫ్-81 బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో ఇవి కనిపించాయి. వీటిని జాగ్రత్తగా వెలికితీసి పేల్చేశారు. స్థానిక సీఐ రాజువర్మ వీటి గురించి భద్రతా బలగాలతో చర్చించారు.

ఛత్తీస్‌గడ్‌లోనే..

గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యాకలాపాలు సాగేవి. కానీ.. ప్రస్తుతం ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లోనే వీరి ఉనికి గట్టిగా ఉన్నట్టు కేంద్రం ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఛత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్యంపై భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకొని వేట కొనసాగిస్తున్నాయి.

దండకారణ్యంలో భద్రతా బలగాలు ఇప్పటికే 47 క్యాంపులు ఏర్పాటు చేశాయి. మరో 16 క్యాంపులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్యాంపుల ద్వారా జరిపిన ఆపరేషన్లలో ఇప్పటివరకు 230 మంది మావోయిస్టులు చనిపోయారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది లొంగిపోయారు. ఈ ఒక్క ఏడాది కాలంలోనే ఏకంగా 1765 మంది మావోయిస్టులు తగ్గిపోయారు.

Whats_app_banner