Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి!-12 maoists killed in gunfight with security forces in chhattisgarh bijapur district ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి!

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి!

Encounter in Chhattisgarh : ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపుర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ (Representative Photo)

Bastar Encounter: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  పోలీసులు, భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.  ఈక్రమంలోనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఘటనాస్థలం నుంచి బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బిజిఎల్), 12-బోర్ రైఫిల్ మరియు మజిల్-లోడింగ్ రైఫిల్స్‌తో సహా 12 ఆయుధాలను  స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం… ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ లో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), బస్తారియా బెటాలియన్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తో పాటు రాష్ట్ర పోలీసుల ఉమ్మడి బృందం పాల్గొంది. గురువారం రాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది.

“బీజాపూర్ జిల్లా కేంద్రానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలోని పిడా అడవుల్లో ఓ ప్రముఖ మావోయిస్టు నాయకుడు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దీని ప్రకారం అనుసరించి ఈ ఆపరేషన్ ప్లాన్ చేయబడింది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు వెలికి తీశారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతదేహాలను గుర్తించాలి." అని సౌత్ బస్తర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమలోచన్ కశ్యప్ తెలిపారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పులు… సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయని ఆయన తెలిపారు.

 

 

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.