Terror threat to Mumbai: ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర; భద్రతాదళాల హై అలర్ట్
ముంబైలో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో నగర వ్యాప్తంగా భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. నగరంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థనాస్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా ఏమైనా లేదా ఎవరైనా కనిపిస్తే వెంటనే తెలియజేయాలని ముంబై పోలీసులు పౌరులను కోరారు.
Terror threat to Mumbai: ఉగ్రదాడి ముప్పు ఉందన్న సమాచారంతో ముంబై అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. మతపరమైన ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబైలోని అన్ని దేవాలయాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా ముందుజాగ్రత్తగా తెలియజేయాలని ఆదేశించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్
మతపరమైన, రద్దీ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పోలీసు సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఆయా జోన్ల పరిధిలో భద్రతా చర్యలను పెంచడంపై దృష్టి సారించాలని ముంబైలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లను ఆదేశించారు. ఉగ్రదాడుల (Terror attack) కుట్ర సమాచారం నేపథ్యంలో నగరంలోని దేవాలయాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా ముందు జాగ్రత్త చర్యగా తెలియజేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆలయల వద్ద భద్రతను పెంచాలని, అన్ని భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించాలని ముంబై పోలీసులు కోరారని సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ చైర్మన్ సదా సర్వాంకర్ తెలిపారు.
క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో
ముంబైలో (Mumbai) రెండు ప్రముఖ మత స్థలాలకు నిలయమైన రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పండుగ సీజన్ నేపథ్యంలో సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల 10 రోజుల గణేష్ చతుర్థి పండుగను జరుపుకున్న ముంబై ఇప్పుడు దుర్గా పూజ, దసరా, దీపావళి కోసం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్ర దాడుల (TERROR) గురించి సమాచారం రావడంతో భద్రతాదళాలు అలర్ట్ అయ్యాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.