Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్; ఇద్దరు జవాన్లు మృతి
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కోకర్నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గగర్మాండు అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా అనంతనాగ్ జిల్లాలోని కోకర్నాగ్ ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి.
ఇద్దరు జవాన్ల మృతి
కోకెర్నాగ్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతమైన దట్టమైన అహ్లాన్ గగర్మాండు అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఎదురుగా వస్తున్న సెర్చ్ బృందాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు గాయపడగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.
అదనపు బలగాల తరలింపు
ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని, ఉగ్రవాదులను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అంతకు ముందు, ‘‘నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, అనంతనాగ్ లోని జనరల్ ఏరియా కోకర్ నాగ్ లో #IndianArmy, @JmuKmrPolice & @crpf_srinagar సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఉగ్రవాదులతో కాంటాక్ట్ ఏర్పడి ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిని అక్కడి నుంచి తరలించాం’’ అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఇద్దరు పౌరులకు గాయాలు
ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా, నిర్లక్ష్యంగా కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారని ఆర్మీ ధృవీకరించింది. వారికి తక్షణ వైద్య సహాయం అందించి, మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది.
ఉగ్రవాదుల స్కెచ్ లు
జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లాలో నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ లను పోలీసులు విడుదల చేశారు. ఈ ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. మల్హర్, బానీ, సియోజ్ ధర్ లోని ధోక్ లలో చివరిసారిగా కనిపించిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ లను జమ్ముకశ్మీర్ (jammu and kashmir) లోని కథువా పోలీసులు విడుదల చేశారు. ఈ టెర్రరిస్టుల గురించి విశ్వసనీయమైన సమాచారం ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన ప్రతిఫలం ఇస్తామని శనివారం ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ లో పేర్కొంది. జూలై 8న కథువాలోని మాచేడిలో భారత సైన్యం పై దాడి చేసిన ఉగ్రవాదులు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) సహా ఐదుగురు సైనికులను పొట్టనబెట్టుకున్నారు. జూలై 15న దోడా జిల్లాలోని దేశా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కెప్టెన్ సహా నలుగురు సైనికులు మరణించారు.