Jammu Kashmir Terror attack : తెగించిన ఉగ్రవాదులు- జమ్ముకశ్మీర్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి!
జమ్ముకశ్మీర్‌లోని ఓ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది.
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో సోమవారం ఉదయం కాల్పుల మోతమోగింది. గుంధ్వ ఖవాస్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్ర దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా ఉగ్రవాదుల ఏరివేత కోసం భారీస్థాయిలో ఆపరేషన్ని చెపట్టింది.
“రాజౌరీలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ప్లాన్ చేసిన భారీ స్థాయి దాడిని సైన్యం తిప్పుకొట్టింది,” అని డిఫెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ భర్త్వాల్ తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం జమ్ముకశ్మీర్‌కి వెళ్లి అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించిన ఒక రోజు వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. నాటి సమావేశంలో జమ్ముకశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ దళాలు, నిఘా ఏజెన్సీలు పాల్గొన్నాయి.
తాజాగా ఘటన.. గురువారం దొడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తోంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జడ్డన్ బాటా గ్రామంలోని తాత్కాలిక సైనిక క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
బుధవారం రాత్రి మరో ఘటనలో రాజౌరీ జిల్లాలోని సుందేర్బానీ సెక్టార్ వద్ద ఉన్న ఎల్ఓసీ వెంబడి భారత సైనికులు అనుమానాస్పద కదలికలను గుర్తించారు. గురువారం గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మంగళవారం దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
అంతకన్నా ముందు కథువా జిల్లాలోని మచేడీ అటవీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఇవన్నీ జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదానికి సంకేతాలుగా మారాయి.
ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు జమ్ములోని ఆరు జిల్లాల్లో 10కిపైగా ఉగ్రదాడులు జరిగాయి. వీటిల్లో 27మంది ప్రజలు, 11 మంది భద్రతా సిబ్బంది, ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.
భారీ భద్రతకు భారత సైన్యం ఏర్పాట్లు..
జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు భారత సైన్యం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఉగ్రవాదుల ఏరివేతకు భారీ ప్రణాళికలు రచించింది. 50-55 మంది ఉగ్రవాదుల వేట కోసం 500కుపైగా మంది పారా స్పెషల్ ఫోర్స్ కమాండోలను భారత సైన్యం జమ్ముకశ్మీర్‌లో మోహరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నిఘా వ్యవస్థల ఫోకస్ మరింత పెరిగినట్టు, ఉగ్రవాదులకు సహాయం చేసే వారిని, అండర్‌గ్రౌండ్ వర్కర్లను పట్టుకునే పనిలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ చర్యలను అడ్డుకునేందుకు ఇప్పటికే 3,500-4000 మంది అదనపు భద్రతా బలగాలను జమ్ముకశ్మీర్‌లో మోహరించినట్టు స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం