Ayyappa Swamy Irumudi : అయ్యప్ప భక్తులు ఇరుముడి ఎందుకు కట్టుకుంటారో తెలుసా.. 8 ఆసక్తికరమైన విషయాలు
Ayyappa Swamy Irumudi : టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషం ఉంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారుచేస్తారు. ఆ నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం విశిష్టం. ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం అంటే.. పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం.
నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటకు వెళ్లిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. మనిషి ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని.. ఇతర జీవులపై ప్రేమతో మెలగాలన్న అంతర్లీనమైన భగవత్ సందేశం.
నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే. మండలం, మకరవిలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజూ నిర్వహిస్తారు. తెల్లవారుఝామున 4.15 గంటలకు ప్రారంభమయ్యే అగ్నిహోమం రాత్రి 11.30 గంటల వరకు నిరాటకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరగిరులు మరింత ఆధ్మాత్మికతను సంతరించుకుంటారు.
1.గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్తూ అయ్యప్పస్వామి స్వరూపంగా కొలుస్తారు. ఇరుముడి కట్టే సమయంలో, దానిని తలపై ధరించేటప్పుడు, చివరకు సన్నిధానం చేరే వరకూ స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించాలి. ఇలా కట్టిన ఇరుముడులను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరముపై పెట్టి శబరిమల యాత్రకు తీసుకెళ్తారు.
2.అయ్యప్పస్వామి దర్శనం అయిన తర్వాత ఇరుముడులను ఒకచోటికి చేర్చి, భక్తి శ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామివారికి సమర్పించేందుకు గురుస్వాములు సిద్ధం చేస్తారు.
3.ముద్ర టెంకాయలను పగులగొట్టి అందులోని నెయ్యిని ఒక పాత్రలో పోయించి స్వామివారి అభిషేకానికి పంపుతారు. మన శరీరాన్ని కొబ్బరికాయగా ఎంచుకొని, అహంకారమనే నారను భక్తి అనే బండరాయిపై అరగదీసి, అందులోని మోహమనే జలంను తీసి, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచార, అనుష్ఠానములనే జ్ఞానమృతమును (నెయ్యి) నింపి, వైరాగ్యమనే మూతను పెట్టి, ఆత్మ అనే లక్కతో ముద్రవేసి, అయ్యప్పస్వామి వారి సన్నిధానికి తీసుకెళ్లి అభిషేకము చేసి పునీతులు కావడం ఇందులోని పరమార్థం.
4.అలా పగలగొట్టి నెయ్యి తీసిన కొబ్బరికాయలను గణపతి హోమగుండంలో వేస్తారు. కొబ్బరికాయలతో పాటూ పేలాలను కొందరు హోమగుండంలో వేస్తారు. ఇరుముడిలోని కానుకలను అయ్యప్పస్వామి వారి హుండీలో వేస్తారు. ఇరుముడులు విప్పి వేరు చేయగానే విభూతి, పసుపు, కుంకుమలను వేర్వేరు పాత్రల్లో పోసి, విభూతి పళ్లెములో ఇరుముడిలోని కర్పూరమును వెలిగించి, ఆ కాంతిలో ఇరుముడులను విప్పుతారు. మిగిలిన కర్పూరమును, అగరుబత్తీలను స్వామివారి సన్నిధానంలోని కర్పూర ఆళిలో వేస్తారు.
5.బెల్లము, ఖర్జూరము, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, తేనె, పేలాలు వీటన్నిటినీ కలిపి పంచామృతాభిషేకమునకు పంపుతారు. పసుపు, కుంకుమ, విభూతి, చందనం, పన్నీరు, మిరియాలు, జాకెట్టు, నల్లగాజులు వీటిని విడివిడిగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కో పళ్లెం తీసుకుని వెళ్లాలి.
6.ప్రతి స్వామి ఒక్కో కొబ్బరికాయ తీసుకొని మాళికాపురం సన్నిధిలో దొర్లించి రావాలి. పసుపు, కుంకుమలను మాళిగైపురత్తమ్మ సన్నిధి వద్ద సమర్పించి స్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు, నల్లగాజులు అమ్మవారికి సమర్పించాలి. కొబ్బరికాయను ముక్కంటి సాక్షాత్కారముగా భావిస్తారు.
7.నారతీయగానే మూడు నేత్రములు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయను పగులగొట్టినా, సాక్షాత్ ఆదిపరాశక్తి ఆవాస స్థలమైన మాళిగైపురత్తమ్మ సన్నిధిలో నారికేళమును పగులగొట్టకుండా, దొర్లించి విడిచిపెట్టడం సంప్రదాయం. అమ్మవారికి కర్పూర హారతి చూపించి, పసుపు, కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి, వెనుక పక్కన ఉన్న భస్మకుళములో స్నానం చేయాలి.
8.సన్నిధానంలో ఇరుముడులను విప్పిన తర్వాత అందులోని బియ్యము నుంచి పిడికెడు బియ్యం అక్షింతలుగా ప్రతివారి ఇరుముడిలోనూ వేస్తారు. శబరిమల పుణ్యస్థలి నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని ఇంట్లోని బియ్యముతో కలిపి ఉంచితే అక్షయ పాత్రలా తరగదని భక్తుల నమ్మకం.