Lord Shiva Temple : ఈ శైవక్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం.. ఇలాంటి దేవాలయం దేశంలో ఎక్కడా లేదు!-it is auspicious to visit the ancient shiva temple in manthani during karthika masam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lord Shiva Temple : ఈ శైవక్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం.. ఇలాంటి దేవాలయం దేశంలో ఎక్కడా లేదు!

Lord Shiva Temple : ఈ శైవక్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం.. ఇలాంటి దేవాలయం దేశంలో ఎక్కడా లేదు!

Basani Shiva Kumar HT Telugu
Published Nov 07, 2024 03:35 PM IST

Lord Shiva Temple : కార్తీకమాసంలో భక్తులు శైవక్షేత్రాలను ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో అత్యంత పురాతణమైన శివాలయాల గురించి వెతుకుతున్నారు. పురాతన శివాలయాల్లో కరీంనగర్ జిల్లా మంథనిలోని శైవక్షేత్రం ఒకటి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మంథని శివాలయం
మంథని శివాలయం

కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ భిక్షేశ్వరుడు - శ్రీ గౌతమేశ్వర ఆలయం ఉంది. పురాతనకాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎందరో వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకుటం, మంత్రపురి పిలిచేవారు. మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అంటే ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి" అని అర్థం.

ఈ క్షేత్రం గొప్పదనాన్ని వివరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే అందులో పూజా మందిరమే ఈ మంథని క్షేత్రం అని అంటారు. మంథని కేవల గ్రామం కాదు. ఆలయాల సమాహార ముక్తిధామం. ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి. అవి భిక్షేశ్వరుడు, గౌతమేశ్వరుడు ఆలయాలు.

భిక్షేశ్వరస్వామి దేవాలయం..

సాధారణంగా ఆలయాలు ఆగమశాస్త్రానుసారం ఉంటాయి. ద్వారం, ధ్వజం ప్రతిదీ శాస్ట్రోక్తంగా ఏర్పాటు చేస్తారు. కొన్ని ఆలయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. అలాంటి గుళ్లు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. మంథనిలో కొలువుదీరిన భిక్షేశ్వరస్వామి దేవాలయం అలాంటిదే. కాశీ తర్వాత అంతటి మహిమాన్విత క్షేత్రంగా కీర్తి గడించింది. సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంతో నిర్మిస్తారు. కానీ, పశ్చిమ ముఖంతో విరాజిల్లే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి.

మంథనిలోని భిక్షేశ్వరస్వామి ఆలయం పశ్చిమ ముఖద్వారం కలిగి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుని ఆలయం తర్వాత పశ్చిమ ముఖద్వారం కలిగిన గుడి ఇదే కావడం విశేషం. అంతేకాదు, దేశంలో మరెక్కడా లేనివిధంగా దక్షిణామూర్తి లింగ రూపంలో వెలసిన క్షేత్రం కూడా ఇదే. పశ్చిమ ముఖద్వారం కలిగిన భిక్షేశ్వరుడి ఆలయంలో పశ్చిమ ముఖంలో శివుడు, అదే గర్భగుడిలో దక్షిణ ముఖంతో దక్షిణామూర్తి కొలువుదీరారు.

భిక్షేశ్వరుడి అనుగ్రహంతో సర్వకార్యాల్లో విజయం కలుగుతుందని విశ్వాసం. ఈ స్వామికి అభిషేకాలు చేయిస్తే జాతకంలోని శని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. వేదవేదాంగాలకు మంథని కేంద్ర బిందువుగా మారడానికి ఇక్కడి దక్షిణామూర్తి కారణమని చెబుతారు. విద్యకు మారుపేరుగా నిలిచే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మంత్రపురి వేదవిద్యకు నిలయంగా మారిందని స్థానికుల నమ్మకం.

ప్రతి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ధ్వజ స్తంభం ఉంటుంది. భిక్షేశ్వరుడి గుడిలో ద్వజ స్తంభు లేకపోవడం మరో విచిత్రం. ధ్వజస్తంభం లేని ఆలయం దేశంలో ఇదొక్కటేనేమో. దక్షిణామూర్తి అనుగ్రహం కోసం విద్యార్డులు వస్తుంటారు. ఎప్పుడూ సందడిగా కనిపించే ఈ క్షేత్రం శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత కోలాహలంగా మారుతుంది. భిక్షేశ్వరుడిని దర్శించుకుంటే రాజసూయయాగం చేసినంత ఫలమనీ అంటారు.

గౌతమేశ్వరాలయం..

గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల గౌతమేశ్వరాలయం అనే పేరు వచ్చింది. మాఘ మాసంలో నియమానుసారం ఇక్కడ స్నానదానాదులు చేస్తే ఏడుజన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుమానంతో పార్వతీదేవి.. గంగను వదిలేయమని శివుడిని వేడుకోగా అందుకు శివుడు అంగీకరించలేదు. దాంతో పార్వతి అలుక వహిస్తుంది. ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి, తమ్ముడు కుమారస్వామిని వెంటపెట్టుకొని గౌతముని ఆశ్రమానికి వస్తాడు.

అక్కడున్న జయని పిలిచి ఆవురూపం ధరించి గౌతముని చేలలో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తాడు. జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో మేస్తుండుగా, గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే, గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణిస్తుంది. గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోడానికి గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేస్తాడు. అదే గోదావరి నది.

శివుడ్ని కూడా తనతోపాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా, ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిశాడు. ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంతో ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకించాడు. అదే గౌతమేశ్వరుడు ఆలయం. తూర్పు దిశగా ప్రవహించే గోదావరి ఈ దేవాలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని ఉత్తర ముఖంగా ప్రవహిస్తోంది. మంథని.. రామగుండం నుండి 40 కిలో మీటర్లు, కరీంనగర్ నుండి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 225 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Whats_app_banner