IIT Madras with AP : ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు.. 8 ముఖ్యాంశాలు-8 highlights of andhra pradesh government key agreements with iit madras ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Iit Madras With Ap : ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు.. 8 ముఖ్యాంశాలు

IIT Madras with AP : ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు.. 8 ముఖ్యాంశాలు

Basani Shiva Kumar HT Telugu
Nov 15, 2024 08:06 PM IST

IIT Madras with AP : అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం, వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు.. ఐఐటీ మద్రాసుతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 8 విభాగాల్లో ఒప్పందాలు కుదిరాయి.

చంద్రబాబుతో ఐఐటీఎం ప్రతినిధులు
చంద్రబాబుతో ఐఐటీఎం ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. ఐఐటీ మద్రాసు నిర్ణయించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ప్రభుత్వంతో కలసి ఐఐటి మద్రాసు పని చేయనుంది.

ఐఐటీఎం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. అనంతరం మంత్రి లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ మద్రాసు డైరక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారధి ఆధ్వర్యంలో 8 ఒప్పందాలు కుదిరాయి.

1. ఐఐటీఎం – ఏపీ సీఆర్డీఏ

అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటీఎం సంస్థ ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది.

2. ఐఐటీఎం – ఏపీ మారిటైమ్ బోర్డు

సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధన తోపాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

3. ఐఐటీఎం – ఏరీ స్కిల్ డెవలప్‌మెంట్

స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్‌ఫాంల ద్వారా.. స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

4). ఐఐటీఎం – ఏపీ విద్యాశాఖ

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఐఐటీఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.

5). ఐఐటీఎం – ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్చక్చర్

విమానాశ్రయాలను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

6. ఐఐటీఎం – ఐటీ శాఖ

అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి.. విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడం. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు.

7. ఐఐటీఎం – ఆర్టీజీఎస్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటీఎం ప్రవర్తక్‌తో ఏపీ ఆర్టీజీఎస్ కలిసి పనిచేస్తుంది.

8. ఐఐటీఎం – క్రీడల శాఖ

అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు.. ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

Whats_app_banner