Kurnool Uranium: కప్పట్రాళ్లలో యూరేనియం బోర్ల తవ్వకాలు ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
Kurnool Uranium: కర్నూలు జిల్లాలో తీవ్ర అలజడి కారణమైన యూరేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూరేనియం వెలికితీత వ్యవహారంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పరిశోధనలు నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Kurnool Uranium: కర్నూలు జిల్లాలో కొద్ది వారాలుగా ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన యూరేనియం నిక్షేపాల వెలికితీతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్లలో యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ప్రజల ఆందోళనలను, భయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కప్పట్రాళ్లలో ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రకటించారు.
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ను నిరసిస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. యూరేనియం తవ్వకాలతో ఆ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని, పంట పొలాలు బీళ్లుగా మారతాయని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళనల నేపథ్యంలో యూరేనియం వెలికితీత ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తక్షణం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక మీదట కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం బోర్ల తవ్వకాల అంశానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ కొనసాగదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం కలెక్టర్ భరోసా ఇచ్చారు.
కప్పట్రాళ్లలో దేశంలో అత్యంత నాణ్యమైన యూరేనియం నిక్షేపాలు ఉన్నట్టు యూరేనియం కార్పొరేషన్ గుర్తించింది. దీంతో కప్పట్రాళ్లలో యూరేనియం వెలికితీతపై పట్టుదలతో ఉంది. 468.25 హెక్టార్ల అటవీ భూమిలో యూరేనియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 6.8 హెక్టార్లలో శాంపిల్స్ సేకరించేందుకు 70బోర్లను తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని బోర్లకు అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానిక ప్రజలు తవ్వకాలను అడ్డుకుంటున్నారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లోని 13 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కప్పట్రాళ్ల చుట్టూ 50కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కప్పట్రాళ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం స్థానికుల్ని వెంటాడుతోంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.