T-SAVE Deeksha : KTRను కాపాడేందుకే సిట్.. దమ్ముంటే CBI విచారణ చేయించండి - వైఎస్ షర్మిల
26 April 2023, 17:30 IST
- T-SAVE Deeksha At Indira Park: తాము తలపెట్టిన టీ - సేవ్ దీక్షకు కావాలనే అనుమతి ఇవ్వలేదన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీక్షను ఆపాలనే కుట్రతోనే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)
YS Sharmila Fires On BRS Govt: తాము తలపెట్టిన టీ - సేవ్ దీక్షకు కావాలనే అనుమతి ఇవ్వలేదన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. కోదండరాం దీక్షకు మాత్రం అనుమతి ఇచ్చారని... తమకు మాత్రం అనుమతి ఇవ్వలేదని.. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీక్షను ఆపాలనే కుట్రతోనే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఇందిరాపార్క్ వేదికగా ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను తలపెట్టారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పథకం ప్రకారమే సిట్ ఆఫీస్ కు వెళ్లేకుండా తనను అడ్డుకున్నారని విమర్శించారు. ఒక్క మహిళను అడ్డుకోవడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ దిగారని... మగ పోలీసులతోనే అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఒక్క పేపర్ ముక్క ఇవ్వడానికి అడ్డుకోవాలా..? అని ప్రశ్నించారు.
" నన్ను అడ్డుకొనేందుకు ఏమి ఆర్డర్స్ లేవు. నన్ను హౌజ్ అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ కూడా లేవు.నేను పోరాటం చేస్తున్నది నిరుద్యోగుల కోసం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం. ప్రభుత్వ పథకాలు అమలు కాకపోతే అమలు కావాలని చేసే పోరాటం. ప్రతిపక్షాలు నోరు మూసుకొని కూర్చుంటే ప్రజల పక్షాన నిలబడాలని నా పోరాటం. ఇదే ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల పక్షాన 72 గంటల పాటు పోరాటం చేశాం. ప్రతి మంగళవారం నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేశా. నన్ను ఎన్ని మాటలు అన్నా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాను. రాష్ర్టంలో నిరుద్యోగ సమస్య ఉంది అని ఎత్తి చూపింది నేనే. ఈ ప్రభుత్వానికి మహిళలు అంటే లెక్కే లేదు. విజయమ్మ ఒక పెద్దావిడ, మాజీ ముఖ్యమంత్రి భార్య, విజయమ్మ కి గౌరవం ఇవ్వకుండా అడ్డుకుంటారా..? వైఎస్ఆర్ హయాంలో పోలీస్ శాఖ ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు పోలీసులను కేసీఅర్ పని మనుషులుగా వాడుకుంటున్నారు. పోలీస్ శాఖ అంటే నాకు గౌరవం. పోలీసులను అవమానపరచడం నా ఉద్దేశ్యం కాదు. నా ఇంటి దగ్గర నా మీద పడాలని చూస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం తోయాల్సి వచ్చింది. అంతేకాని కొట్టాలని నా ఉద్దేశ్యం కాదు. పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎవరు జీతాలు ఇస్తున్నారు..ఎవరికి సేవ చేస్తున్నాం తెలుసుకోవాలి" అంటూ షర్మిల హితవు పలికారు.
కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాంలే అని షర్మిల ఆరోపించారు. సిట్ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టిన రీతిలో విచారణ చేస్తున్నారని విమర్శించారు. కేవలం 19 మందిని మాత్రమే దోషులుగా చిత్రీకరణ చేశారని.. పెద్ద తలకాయలను వదిలేశారని అన్నారు. పాత్రదారులను మాత్రమే పట్టుకున్నారు..సూత్ర దారులను వదిలేశారని దుయ్యబట్టారు. సూత్రదారులకు రెడ్ కార్పెట్ వేసి మరీ తప్పించారని చెప్పారు. ఈ దర్యాప్తు విషయంలో మాకున్న అనుమానాలను సిట్ వివరిద్ధామని అనుకున్నాం అని తెలిపారు.
" పేపర్ లీకుల్లో ఐటీ లోపాలు ఉన్నాయి. స్వయంగా చైర్మన్ చెప్పాడు పేపర్ హ్యాక్ అయిందని. మా ఐపీ అడ్రస్ లు దొంగతనం చేసి పేపర్లు కాపీ చేశారు అని చెప్పాడు. ఇదేనా ఐటీ శాఖ భద్రత..? ఎవడు పడితే వాడు పేపర్లు కాపీ చేసుకుని వెళ్లేలా ఉంది మీ భద్రత. ఇక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ TSPSC పారదర్శకత ఉంది అంటాడు. పేపర్ లీక్ అయ్యే సరికి నాకేం సంబంధం అంటాడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్ కి నేను మంత్రిని కాదు అంటాడు. అసలు IT మంత్రికి ఆయన విధివిధానాలు తెలుసా..? 2000 ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతి కంప్యూటర్ కి ఆడిట్ జరగాలి. ప్రతి ఏడాది సెక్యూరిటీ సర్టిఫికెట్ తీసుకోవాలి. డిజిటల్ సెక్యూరిటీ ఉండాలి. ఏ శాఖ సిస్టం వాడినా దాని భద్రత ఐటీ శాఖ పరిధిలో ఉంటుంది. సూటు బూటు వేసుకొని విదేశాలు తిరిగితే ఐటీ శాఖ మంత్రి అనరు. ఐటీ ఉద్యోగం చేసిన కేటీఆర్ కి ఫైర్ వాల్స్ అంటే తెలియదా..? IP అడ్రస్,ఒక ఫాస్ వర్డ్ ఉంటే.. ఎవడైనా కంప్యూటర్ ను హ్యాక్ చేయొచ్చా..? ప్రభుత్వ పరిధిలో వాడుతున్న కంప్యూటర్లకు ఎన్నింటికి భద్రత సర్టిఫికెట్లు ఉన్నాయో బయట పెట్టాలి. CBI విచారణ చేస్తే ఐటీ లోపాలు బయట పడతాయని భయం. తీగ లాగితే IT శాఖ డొంక కదిలే ప్రమాదం ఉంది. అందుకే కేటీఆర్ ను కాపాడేందుకే సిట్ వేసుకున్నారు. సీబీఐ కి కేసు ఇవ్వక పోవడానికి ఇదే కారణం. కేటీఆర్ కి సవాల్ విసురుతున్నాను... మీకు దమ్ముంటే CBI విచారణ చేయించండి. కమిషన్ లో వాడుతున్న కంప్యూటర్లకు ఆడిట్ సర్టిఫికెట్ లు బయట పెట్టండి" అని షర్మిల డిమాండ్ చేశారు.
టీ- సేవ తరపున కేసీఆర్ కి ఒక ప్రశ్న పత్రం పంపుతున్నట్లు షర్మిల ప్రకటించారు. ఇందులో పది ప్రశ్నలు ఉన్నాయని... వాటికి దమ్ముంటే కేసీఅర్ సమాధానం చెప్పాలన్నారు. ఇక షర్మిల దీక్షకు ప్రజా యుద్ధనౌక గద్దర్ మద్దతు ప్రకటించారు. దీక్షలో పాల్గొన్న ఆయన... షర్మిలతో మాట్లాడారు.