Tspsc Paper Leak: సిట్ కస్టడీకి పేపర్ లీక్ కేసు నిందితులు
Tspsc Paper Leak:పేపర్ లీకేజీ కేసులో కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ నుంచి ప్రశ్నా పత్రాలు కొనుగోలు చేసిన సుస్మిత, ఆమె భర్త సాయి లౌకిక్‌ను మూడు రోజుల సిట్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న దంపతుల్ని నేడు సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.
Tspsc Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన సుస్మిత, ఆమె భర్త సాయి లౌకిక్‌లను మూడు రోజుల పాటు సిట్ కస్టడీలోకి తీసుకోడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సుస్మిత, కార్ల వ్యాపారి సాయిలౌకిక్‌లను ఏప్రిల్ 14వ తేదీన సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుస్మిత దంపతులు, ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసి, పరీక్ష రాశారు. గత శుక్రవారం వీరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో నిందితుల సంఖ్య 17కు చేరింది.
మరోవైపు టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీలని గురువారం ఈడీ అధికారులు విచారించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు విచారించారు. పేపర్ లీకేజీకి ముందు కమిషన్ కార్యాలయంలో ఏం జరిగిందనే వివరాలను వారి నుంచి సేకరించారు.
అటు పేపర్ లీకేజీలో హవాలా నగదు లావాదేవీలు ఉన్నందున వీటిపై దర్యాప్తు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితో పాటు టీఎస్‌పీఎస్సీ తరఫున ఈ కేసులో ఫిర్యాదుదారు సత్యనారాయణలను విచారించారు. నేడు కూడా విచారణ కొనసాగనుంది.
శంకర లక్ష్మిని ఈ కేసులో కేవలం సాక్షిగానే సిట్ పేర్కొంది. ఈడీ మాత్రం శంకర్ లక్ష్మి నుంచే దర్యాప్తు ప్రారంభించింది. పేపర్ల లీకేజీ కుట్రకు శంకర్‌లక్ష్మి కంప్యూటర్ నుంచే మూలాలు ఉండడంతో తొలుత ఆమెను మొదట ఈడీ అధికారులు విచారించారు.
దర్యాప్తులో భాగంగా నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. టీఎస్‌పీఎస్‌సీకి విధుల నిర్వహణకు సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారని విచారణానంతరం శంకరలక్ష్మి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తమ ఆధార్, పాన్ వివరాలు తీసుకున్నారని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని ఆమె చెప్పారు.
కంప్యటర్లు ఎలా తెరిచారు…
శంకర్‌లక్ష్మికి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలతో ఉన్న పరిచయం, ఆఫీస్‌లో వారి ప్రవర్తన, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి ఎలా ప్రవేశించేవారు, డబ్బు లావాదేవీల గురించి చర్చించే వారా..? కంప్యూటర్లను ఎలా యా క్సెస్ చేశారు, కంప్యూటర్ పాస్‌వర్డ్‌లు ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా అని ఈడీ అధికారులు సిబ్బందిని ప్రశ్నించారు. కంప్యూటర్ పరిసరా ల్లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఉన్నాయో లేదో విచారించారు.
టీఎస్‌పీఎస్సీ అధికారి సత్యనారాయణ నుంచి కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పేపర్‌లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీ దృష్టికి ఎలా వచ్చింది, ఏ పేపర్లు లీకైనట్లు గుర్తించారో ప్రశ్నించారు. ఉద్యోగుల పాత్రపై అంతర్గతంగా ఏ చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలు సేకరించినట్టు తెలిసింది. వీటిని ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.