YS Sharmila Bail: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు…-ys sharmila granted conditional bail released in the evening ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila Bail: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు…

YS Sharmila Bail: వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు…

HT Telugu Desk HT Telugu
Apr 25, 2023 01:32 PM IST

YS Sharmila Bail: పోలీసులపై దాడి చేసిన ఘటనలో వైఎస్‌.షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును పోలీసులకు స్వాధీనం చేయాలని, విచారణకు సహకరించాలని ఆదేశించింది.

వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లికోర్టు
వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లికోర్టు (HT_PRINT)

YS Sharmila Bail: పోలీసులపై దాడి చేసిన ఘటనలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం లోటస్‌పాండ్‌ నివాసం నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను అడ్డుకున్నందుకు పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో షర్మిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలకు 14రోజులు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్ గూడా జైలుకు తరలించారు.

మంగళవారం షర్మిల దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పోలీసులపై ఉద్దేశపూర్వకంగా షర్మిల దాడి చేయలేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. 41సిఆర్‌పిసి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని షర్మిల తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు షర్మిల బెయిల్ పిటిషన్‌పై పోలీసుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

గతంలో షర్మిల నాంపల్లి కోర్టులో అఫిడవిట్‌ సైతం దాఖలు చేశారని గుర్తు చేశారు. పదేపదే ఆమె వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపించారు. బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో పాటు, షర్మిలపై పోలీసులు రెండేళ్లలోపు జైలు శిక్ష విధించే కేసులు మాత్రమే నమోదు చేయడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

రెండు ష్యూరిటీలతో పాటు రూ.30వేల పూచీకత్తులు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. షర్మిల పాస్‌పోర్టును పోలీసులకు స్వాధీనం చేయాలని, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ష్యూరిటీలు సమర్పించి, కోర్టు నిర్దేశించిన పాస్‌పోర్ట్ స్వాధీనం చేస్తే సాయంత్రంలోగా షర్మిల విడుదలయ్యే అవకాశం ఉంది.

పోలీసులపై చేయిచేసుకున్నందుకు షర్మిలతో పాటు, ఆమె డ్రైవరు బాలు, జాకబ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 332, 353, 509, 427, 109, 337, రెడ్‌ విత్‌ 34 కింద కేసులు నమోదు చేశారు.

Whats_app_banner